తొమ్మిదేళ్ల తర్వాత లారెన్స్ ‘మెగా’ స్టెప్పులు

డాన్స్ మాస్టర్ గా విపరీతమైన డిమాండ్ ఉన్న టైంలోనే దర్శకుడిగా మారి నాగార్జునతో మాస్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన రాఘవేంద్ర లారెన్స్ ఆ తర్వాత ముని సిరీస్ నుంచి హీరోగా, డైరెక్టర్ గా బిజీ అయిపోయాడు. ప్రత్యేకంగా ఎవరికీ నృత్య దర్శకత్వం చేసే పరిస్థితి లేకపోవడంతో దానికి దూరంగా ఉన్నాడు. అయితే ముందు నుంచి లారెన్స్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఠామేస్త్రిలో సైడ్ డాన్సర్ గా ఉన్న తనకు హిట్లర్ రూపంలో అతి పెద్ద బ్రేక్ ఇవ్వడం వల్లే అందరితో సినిమాలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటాడు.

అందుకే తొమ్మిదేళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటను కంపోజ్ చేయమని పిలుపు వచ్చినప్పుడు ఆలోచించకుండా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి చేశానని లారెన్స్ ఆ మధ్య తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఈ కలయిక సాధ్య పడలేదు. తాజాగా విశ్వంభరలో ఒక పాట కోసం తిరిగి ఈ కాంబో రిపీట్ కానుందని సమాచారం. డాన్స్ బీట్ ఉన్న ఒక మంచి పాటకు లారెన్స్ అయితేనే న్యాయం చేస్తాడని భావించిన మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి అడగటంతో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మెగా కాంపౌండ్ న్యూస్. ఇంకా అఫీషియల్ అయితే కాలేదు.

వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఆగస్ట్ లోపే పూర్తి చేసి చిరు పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ దాకా ఏ విషయంలో రాజీ పడకుండా యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. భోళా శంకర్ డిజాస్టర్ దెబ్బకు ఒప్పుకున్న వేరే సినిమా పక్కన పెట్టి మరీ విశ్వంభరకు అంకితమైపోయిన చిరు దానికి తగ్గట్టే పూర్తయ్యేవరకు వేరే కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.