2024 ఆరు నెలలు – బాక్సాఫీస్ రివ్యూ

కొత్త సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. కాలం కర్పూరంలా కరిగిపోతోంది. టాలీవుడ్ పరంగా చూసుకుంటే మరీ బ్రహ్మాండంగా వెలిగిపోయిందని చెప్పలేం కానీ కొన్ని బ్లాక్ బస్టర్లు అందించిన ఊపిరి వల్ల థియేటర్లు బ్రతికి బట్టకడుతున్నాయి.

ముందుగా విజయాలు సాధించిన వాటిని చూస్తే ఇటీవలే విడుదలైన కల్కి 2898 ఏడి మొదటి స్థానంలో నిలిచి వారం తిరక్కుండానే ఆరు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండో ప్లేస్ లో ఉన్న హనుమాన్ భీకరమైన పోటీని తట్టుకుని మరీ సంక్రాంతి బరిలో విజేతగా నిలవడం ఎప్పటికైనా చెప్పుకునే ప్రత్యేక చరిత్ర.

సీక్వెల్స్ ఆడవనే అంచనాలు పటాపంచలు చేస్తూ బాహుబలి రూటు పట్టిన టిల్లు స్క్వేర్ వంద కోట్లు దాటేసి సిద్ధూ జొన్నలగడ్డ బ్రాండ్ ని అమాంతం రెట్టింపు చేసింది. నాగార్జున సక్సెస్ ఆకలిని తీరుస్తూ నా సామిరంగ కమర్షియల్ గా లాభాలు తెచ్చేయగా ఓం భీం బుష్, గామిల టాక్ కొంత మిశ్రమంగా వచ్చినప్పటికి వాటికైన బడ్జెట్ కోణంలో చూసుకుంటే చాలా సేఫ్ ప్రాజెక్ట్స్ గా బయటపడ్డాయి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, భీమా, ఊరిపేరు భైరవకోన లాంటివి బయ్యర్లను నిరాశపరచకుండా గట్టెక్కించాయి. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన వాటిలో ది ఫ్యామిలీ స్టార్, ఆపరేషన్ వాలెంటైన్, సైంధవ్, ఈగల్ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి అంచనాలు అందుకోలేకపోయినా నిర్మాణ సంస్థ అన్ని ఏరియాలు రికవరయ్యాయని ప్రకటించింది. ప్రసన్నవదనం టాక్ బాగున్నా సూపర్ హిట్ ముద్ర పడలేదు. డబ్బింగ్ సినిమాల్లో మహారాజ సర్ప్రైజ్ హిట్ గా నిలవగా బాక్ అరణ్మయి 4 ఎవరికీ నష్టాలు ఇవ్వలేదు. భజే వాయు వేగం, మనమే, హరోంహర మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. లవ్ మీ, ప్రతినిధి 2, కృష్ణమ్మ, ఆ ఒక్కటి అడక్కు చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్నా కనీసం యావరేజ్ గా నిలవలేదు. ఇక చిన్నా చితకా సినిమాలు ఓపెనింగ్ రోజే బుడగల్లా పేలినవి ఎన్నో. థియేటర్ రిలీజ్ ఆనందం తప్ప నిర్మాతకేం మిగల్లేదు.

మొత్తానికి కొంచెం ఇష్టం ఎంతో కష్టంలా 2024 సగం గడిచిపోయింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ చివరి వారం దాకా ఎగ్జి బిటర్లు నరకం చూసినంత పని చేశారు. ఈ మూడు నెలల కాలంలో ఎక్కువ శాతం రోజులు ఖాళీ థియేటర్లతో గడపాల్సి వచ్చింది. కల్కి 2898 ఏడి నుంచే తిరిగి సందడి మొదలైంది. రాబోయే సగం ఏడాదిలో బోలెడు ప్యాన్ ఇండియా రిలీజులు కాచుకుని ఉన్నాయి. ఇవన్నీ ఏపీలో కొత్త ప్రభుత్వం పుణ్యమాని టికెట్ రేట్ల పెంపు లాంటి వెసులుబాట్లు పొందబోతున్నాయి కాబట్టి ఇకపై మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.