గ్రౌండ్ సెట్ చేసిన స్టెప్పామార్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయడంతో అభిమానులు అలెర్ట్ అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

రామ్, పూరి ఇద్దరూ పెద్ద డిజాస్టర్ తర్వాత చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాల పరంగా చాలా పెద్ద బరువునే మోస్తున్నారు. ఆగస్ట్ 15 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టు ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు.

ఇక పాట సంగతి చూస్తే మణిశర్మ మరోసారి పక్కా మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. మొదటిసారి విన్నప్పుడు ఫస్ట్ పార్ట్ లో టైటిల్ సాంగ్ లాగే అనిపించినా రెండింటికి చాలా వ్యత్యాసమున్న విషయం మెల్లగా అర్థమవుతుంది.

సీక్వెల్ కాబట్టి గెటప్ తో సహా అన్ని రిపీట్ చేయడం వల్ల విజువల్ గా ఆ ఫీలింగ్ కలిగినా మంచి క్యాచీ ట్యూన్ తో మెలోడీ బ్రహ్మ ఈసారి మరింత మాస్ పల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అనురాగ్ కులకర్ణి, సాహితి గాత్రంలో భాస్కరభట్ల సాహిత్యం పూరి స్టాండర్డ్ కు తగ్గట్టే పూర్తి కమర్షియల్ స్కేల్ లో సాగింది. వినగా వినగా లిరిక్స్ ఆడియన్స్ లోకి వెళ్లేలా ఉన్నాయి.

ఛార్ట్ బస్టర్ అవుతుందో లేదో వెంటనే చెప్పలేం కానీ డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి అంచనాలు పెంచడంలో మాత్రం కీలక పాత్ర పోషించేలా ఉంది. రిలీజ్ కు ఇంకో 45 రోజులే ఉన్న నేపథ్యంలో పూరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు.

ఆ రోజు రెండు చిన్న సినిమాలతో పాటు విక్రమ్ తంగలాన్ పోటీకి వస్తుండటంతో మార్కెట్ పరంగా డబుల్ ఇస్మార్ట్ కే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. అన్ని ప్రధాన భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా ఫలితం పట్ల రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబుతో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.