పంజా దర్శకుడికి నయనతార సడలింపు

అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా సరే ప్రమోషన్లకు రాదనే సంగతి కొత్తది కాదు. సంతకం పెట్టే టైంలోనే ఈ విషయాన్ని ముందే స్పష్టంగా చెప్పి మరీ షూటింగ్ కు వస్తుంది. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో నటించినా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరు కాలేదు. ట్విట్టర్ లో ఒక థాంక్స్ నోట్ తో సరిపెట్టింది. అంతకు ముందు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ ఎవరితో నటించినా ఇదే వరస. వేడుకలకు సరే కనీసం మీడియా ఇంటర్వ్యూలిమ్మన్నా మొహమాటం లేకుండా నో అనేస్తుంది.

కానీ పంజా దర్శకుడికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. విష్ణువర్ధన్ ఇటీవలే నేసిప్పయ అనే సినిమా తీశారు. అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు క్యాన్సిలయ్యాక సమయం వృధా కాకుండా ఇలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఆశించినంత బజ్ లేకపోవడంతో ప్రమోషన్ల కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. నయన్ కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్లలో విష్ణువర్ధన్ తీసిన అజిత్ బిల్లాది ప్రత్యేక స్థానం. ఇది వచ్చాకే ఆమెకు డిమాండ్ పెరిగి వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. చంద్రముఖి కన్నా ఎక్కువ పేరు బిల్లాతోనే వచ్చింది.

ఆ అభిమానమే నయనతారకు తన పట్టుని సడలించుకునేలా చేసింది. ఇది బాగానే ఉంది కానీ మరి కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి తీసుకున్న దర్శక నిర్మాతల కోసం కూడా ఇలా ఈవెంట్లకు రావొచ్చు కదా అంటే మాత్రం సమాధానం ఉండదు. ఇది ఎలాగూ ఉత్పన్నం అవుతుందని ముందే గుర్తించిన నయన్ స్టేజి మీద మాట్లాడుతూ తనకు సహజంగా సినిమా వేడుకలకు హాజరు కావడం ఇష్టం ఉండదని, కానీ విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్ల ఒప్పుకున్నానని చెప్పింది. ప్రస్తుతం అర డజను సినిమాలతో నయనతార మాములు బిజీగా లేదు.