సినిమా వేడుకల్లో జగన్ మీద పంచులు

ఎన్నికల్లో గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం సహజమే కానీ ఇటీవలే జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికలు, వాటి ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ జనసేన బిజెపి కూటమి ఘనవిజయం దేశమంతా మాట్లాడుకునేలా చేసింది. ఇది సినీ పరిశ్రమలోనూ పలు పరిణామాలకు దారి తీసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అలియన్స్ విక్టరీ పేరుతో ఒక గ్రాండ్ ఈవెంట్ చేస్తే దాంట్లో నేరుగా జగన్ గురించి ఎస్కెఎన్, హైపర్ ఆది లాంటి వాళ్ళు మంచి కౌంటర్లు వేశారు. లెవెన్ (పదకొండు) అనే సినిమా ట్రైలర్ లాంచ్ లో ఆ నెంబర్ గురించి ప్రశ్న వచ్చినప్పుడు టీమ్ నవ్వుకున్న విధానం వైరలయ్యింది.

నిన్న అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన అజ్మల్ తన ప్రసంగం మొదలుపెట్టబోయే ముందు ఆడియన్స్ నుంచి కొందరు బిగ్గరగా జగన్ మావయ్యా అంటూ పదే పదే పిలవడంతో కాసేపు నవ్వుతూ ఉండటం తప్ప అతనేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం, శపథంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిగా నటించింది ఇతనే కాబట్టి జనాలు ఆ రకంగా టార్గెట్ చేశారన్న మాట. యాత్ర 2లో జీవా ఇదే క్యారెక్టర్ చేసినా అజ్మలే ఎక్కువ గుర్తుండిపోయాడు కాబోలు. వ్యూహం సినిమా ఎవరూ చూడకపోయినా ట్రైలర్లో బాగా కనెక్ట్ అయ్యాడు.

చూస్తుంటే ఈ ప్రవాహం ఇప్పట్లో ఆగేలా లేదు. జగన్ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో పాటు గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అయనతో పాటు వైసిపి మంత్రులు చేసిన కామెంట్లు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద చేసిన దారుణమైన విమర్శలు జనంలో విపరీతమైన నెగటివిటీని తీసుకొచ్చాయి. అదే ఇప్పుడు ప్రతి చోట ప్రతిబింబిస్తోంది. అసెంబ్లీకి కేవలం ఒక్క రోజు మాత్రమే హాజరై పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిపోయిన మాజీ సీఎం మీద ఓటమి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఆన్ లైన్ లో ఏమో కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆఫ్ లైన్ ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.