కాలం చాలా విచిత్రమైనది. సినిమాల్లో తెరమీద చూసే డ్రామా ఒక్కోసారి నిజ జీవితంలో జరుగుతుంది. ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అలాంటిదే ఈ సంఘటన. 1996లో పవన్ కళ్యాణ్ ని తెరకు పరిచయం చేసినప్పుడు హీరోయిన్ గా ఎవరినైనా కొత్తవాళ్లను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు ఈవివి సత్యనారాయణ పెద్ద కసరత్తే చేశారు. అనుకోకుండా అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ యార్లగడ్డకు ఆసక్తి ఉందని తెలుసుకుని అడగడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. ఆ సంవత్సరం అక్టోబర్లో ఈ మూవీ రిలీజయ్యింది.
బ్లాక్ బస్టర్ కాలేదు కానీ కమర్షియల్ గా పవన్ లో అన్నయ్యకు తగ్గ కంటెంట్ ఉందని జనాలకు అర్థమయ్యేలా చేసింది. కానీ సుప్రియకు తర్వాత నటించే ఉద్దేశం లేకపోవడంతో యాక్టింగ్ కి దూరంగా ఉండిపోయారు. ఎక్కడో ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్పించి పవన్, సుప్రియలు కలుసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. కట్ చేస్తే 28 సంవత్సరాల తర్వాత ఈ రోజు డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ ను కలుసుకునేందుకు ఇండస్ట్రీ పెద్దలు వెళ్లారు. పరిశ్రమ కీలక నిర్మాతల్లో ఒకరిగా ఉన్న సుప్రియ యార్లగడ్డ కూడా వాళ్ళతో పాటు హాజరయ్యారు. ఫ్యాన్స్ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోయారు.
గ్యాప్ తీసుకున్న సుప్రియ ఆ మధ్య అడివి శేష్ గూఢచారిలో ఒక కీలక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటూ తిరిగి ఏ ఆఫర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తన పక్కన హీరోగా చేశారనే ఫీలింగ్ బహుశా గమ్మత్తుగా ఉంటుందేమో. టాలీవుడ్ తరఫున సన్మానం కోసం జరిగిన సమావేశంలో నిర్మాతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ డేట్ అడిగారు. త్వరలోనే చర్చించి సమాచారం అందజేస్తామని పవన్ హామీ ఇవ్వడంతో మీటింగ్ ముగిసింది. అంతకు మించి ఎక్కువ డిస్కషన్లు జరగలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates