34 సంవత్సరాల తర్వాత వైజయంతి ఐపీఎస్

తెలుగు సినిమా చరిత్రలో మహిళా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకు ఒక ఐకానిక్ మోడల్ గా నిలిచిపోయిన మూవీ కర్తవ్యం. 1990లో రిలీజై ఎలాంటి కమర్షియల్ హీరో లేకుండా కేవలం విజయశాంతి పాత్రనే హైలైట్ చేస్తూ దర్శకుడు మోహనగాంధీ తీర్చిదిద్దిన విధానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇండియాలో మొదటి పవర్ ఫుల్ లేడీ ఐపీఎస్ గా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడీ కథను ఆధారంగా చేసుకుని పరుచూరి సోదరులు రాసిన స్క్రిప్ట్ ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఆ తర్వాత విజయశాంతి ఖాకీ దుస్తుల్లో ఇంకొన్ని సినిమాలు చేశారు అవేవి కర్తవ్యంని టచ్ చేయడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు.

ఇప్పుడీ ప్రస్తావనకు కారణం సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇంకే ఆఫర్ ఒప్పుకోని విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమాలో వైజయంతి ఐపీఎస్ గా నటించడమే. కర్తవ్యంలోనూ ఇదే పేరు ఉంటుంది. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో వయసు మళ్ళినా కూడా అదే ఫైర్ చూపిస్తున్న లేడీ అమితాబ్ ని చూసి పాత అభిమానులు అలా జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ కాప్ డ్రామాకు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు. షూటింగ్ కీలక దశలో ఉన్న ఎన్కెఆర్ 21 ఈ సంవత్సరమే విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

చూస్తుంటే విజయశాంతి గారు తిరిగి సినిమాల్లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే ఆర్సి 16లో ఆవిడో పాత్ర చేస్తుందనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో నిర్ధారణ కాలేదు. కానీ ఇప్పుడీ ఎన్కెఆర్ 21 టీజర్ చూశాక యాక్టింగ్ ని మళ్ళీ సీరియస్ గా తీసుకున్నారేమో అనిపిస్తోంది. బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ కు గత ఏడాది చివరిలో డెవిల్ ది బ్రిటిష్ ఏజెంట్ ఫలితం నిరాశకు గురి చేసింది. అందుకే ఈసారి మాస్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. అంచనాలకు తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ కనిపిస్తోంది.