అయోమయం సృష్టించిన రాజశేఖర్ కల్కి

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మూవీ లవర్స్ పదే పదే బుక్ మై షో, పేటిఎంలు ఓపెన్ చేసుకుంటూ తమకు కావాల్సిన థియేటర్లలో టికెట్లు కొనుక్కునే పనిలో పడ్డారు. క్షణాల్లో హౌస్ ఫుల్స్ కావడం ముందే ఊహించి దానికి తగ్గట్టే వాలెట్స్ సర్వ సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో హఠాత్తుగా రాజశేఖర్ కల్కి బుక్ మై షోలో ప్రత్యక్షమయ్యింది. దీంతో కేవలం టైటిల్ మాత్రమే చూసుకున్న ప్రేక్షకులు క్యాస్టింగ్ ఇతర వివరాలు చెక్ చేసుకోకుండా వెంటనే కొనేసుకున్నారు.

తీరా చూస్తే అది ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన కల్కి అని తెలుసుకుని షాక్ తిన్నారు. కావాలనే దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. కూకట్ పల్లి భ్రమరాంబ లాంటి పెద్ద సింగల్ స్క్రీన్లో అన్ని షోలు ఫుల్ అయ్యాక అది రాజశేఖర్ మూవీ అని తెలుసుకుని ఖంగు తినడం జనాల వంతైంది. నిజానికి టెన్షన్ పడేందుకు ఏమి లేదు. కేవలం సాంకేతిక సమస్య వల్ల ప్రభాస్ పోస్టర్ బదులు పాత కల్కి ఇమేజ్ పెట్టడం వల్ల యాప్ లో రెండు సినిమాలు కనిపించాయి. ఇది చాలా అయోమయానికి దారి తీయడంతో పాటు రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో వచ్చేశాయి.

ఎవరైతే కల్కికి బుక్ చేసుకున్నారో టైటిల్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాకే వర్తిస్తాయట. ఒకవేళ క్యాన్సిల్ అయినా రీ ఫండ్ జరిగి తీరుతుంది తప్ప బలవంతంగా రాజశేఖర్ కల్కి చూడాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న పొరపాటు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఆన్ లైన్, అఫ్ లైన్ ఎక్కడ చూసినా కల్కికి సంబంధించిన చర్చ తప్ప మరొకటి కనిపించడం లేదు. టికెట్లు బుక్ చేసుకోవడం తప్ప మరో పనేం లేదనే రేంజ్ లో ఫ్యాన్స్ యాప్స్ మీద దాడి చేస్తున్నారు. ఇంత సందడి వాతావరణం చూసి నాలుగు నెలలు దాటేసింది.