బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో ప్రపంచ స్థాయి, ప్రతిష్టాత్మక చిత్రం.. కల్కి 2898 ఏడీ. మామూలుగా రాజమౌళి చిత్రాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా రాబట్టుకోగలిగింది.
‘మహానటి’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గని స్థాయిలో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సమాధానం అన్నట్లుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. వైజయంతీ మూవీస్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రోమోలు చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు ఏమాత్రం తక్కువగా అనిపించట్లేదీ చిత్రం.
ఈ సినిమా కోసం ఇండియా అంతటా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఐతే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫిక్స్ చేసిన టికెట్ల రేట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్సుల్లో 100 రేటు పెంచేశారు. తెల్లవారుజామున షోలకు ఏకమొత్తంగా రూ.200 అదనపు రేట్ ఫిక్స్ చేశారు. ఏపీలో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో రేట్లు ఉంటాయని అంటున్నారు.
‘కల్కి’ లాంటి విజువల్ వండర్‌కు ఎక్కువ డబ్బు పెట్టడానికి రెగ్యులర్ సినీ గోయర్స్ రెడీగానే ఉంటారు. కానీ వారి అంచనాలను కూడా కొత్త రేట్లు మించిపోయాయి. ఇలా రేట్లు పెంచడం వల్ల సినిమాకు కొన్నిసార్లు ప్లస్ అవుతుంది. కొన్నిసార్లు మైనస్ కూడా అవుతుంది.
అదనపు రేట్లు వల్ల ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో వస్తాయి. ఓవరాల్ వసూళ్లు కూడా పెరిగే ఛాన్సుంటుంది. రికార్డులు కూడా బద్దలు కావచ్చు. కానీ ఈ రేట్లు చాలా ఎక్కువ అని ఫీలై థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గనూ తగ్గొచ్చు. ముఖ్యంగా సినిమా టాక్ కొంచెం అటు ఇటు అయితే అధిక ధరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ‘కల్కి’కి టాక్ చాలా కీలకం కానుంది.