క‌ల్కి లెక్క తేలిపోయింది

Kalki

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ క‌ల్కి 2898 ఏడీ విడుద‌ల‌కు ఇంకో వారం రోజులే మిగిలున్నాయి. ఇప్ప‌టిదాకా ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే లేని విధంగా రూ.600 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కింద‌టే ఈ చిత్రానికి ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోయింది.

మంగ‌ళ‌వారం నాడు క‌ల్కికి సెన్సార్ తంతు కూడా పూర్త‌వ‌డం విశేషం. ఈ చిత్రానికి అనుకున్న‌ట్లే యు-ఎ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. అంటే పెద్దలే కాక వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పిల్ల‌లూ సినిమా చూడొచ్చ‌న్న‌మాట‌. ఈ సినిమా ప్రోమోలు చూస్తే పిల్ల‌లు సినిమా ప‌ట్ల బాగానే ఆక‌ర్షితుల‌వుతార‌ని చెప్పొచ్చు. ఇక క‌ల్కి ర‌న్ టైం ఎంత అన్నది కూడా సెన్సార్ స‌ర్టిఫికేష‌న్‌తో పాటే వెల్ల‌డైంది.

2 గంట‌ల 55 నిమిషాల పెద్ద నిడివితో క‌ల్కి విడుద‌ల కాబోతోంది. ఈ త‌ర‌హా ఎపిక్ మూవీస్ ఎక్కువ ర‌న్ టైంతోనే రిలీజ‌వుతాయ‌న్న అంచ‌నా ఉంటుంది. బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీస్ పెద్ద ర‌న్ టైంతోనే ఘ‌న‌విజ‌యాన్నందుకున్నాయి. కాబ‌ట్టి ఎక్కువ నిడివి అన్న‌ది స‌మ‌స్యే కాదు.

క‌ల్కి లాంటి విజువ‌ల్ వండ‌ర్స్‌కు ప్రేక్ష‌కులు ఎక్కువ స‌మ‌యం థియేట‌ర్ల‌లో గ‌డ‌ప‌డానికే ఆస‌క్తి చూపిస్తారు. ఇండియాలో సినిమా గురువారం రిలీజ్ కానున్న నేప‌థ్యంలో లాంగ్ వీకెండ్లో వ‌సూళ్ల మోత మోగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక రోజు ముందు యుఎస్ స‌హా ప‌లు దేశాల్లో ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి.

యుఎస్‌లో ఇప్ప‌టికే ఈ చిత్రం ప్రి సేల్స్ ద్వారా రికార్డు స్థాయిలో 2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. రిలీజ్ టైంకి ఆ లెక్క 3 మిలియ‌న్ డాల‌ర్ల మార్కును కూడా అందుకునే అవ‌కాశ‌ముంది. పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో మేజ‌ర్ రికార్డుల‌న్నింటినీ క‌ల్కి బ‌ద్ద‌లు కొట్టేయొచ్చు.