మంటెత్తిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ చిత్రాన్నీ వాటి మేకర్స్ సరిగా ప్రమోట్ చేయలేదని అభిమానుల్లో అసంతృప్తి ఉంది. సమయానికి అప్‌డేట్స్ ఇవ్వరని.. ప్రభాస్ రేంజికి తగ్గట్లుగా సినిమాకు హైప్ తీసుకొచ్చేలా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వట్లేదని వాళ్లు సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్స్ చేయడం చాలాసార్లు చూశాం. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్.. ఇలా ప్రతి సినిమాకూ వాటి మేకర్స్ మీద ఫ్యాన్స్ యుద్ధం ప్రకటించారు. ఇప్పుడిక ‘కల్కి’ వంతు వచ్చింది.

ఈ సినిమా విడుదలకు అటు ఇటుగా వారం రోజులే సమయం ఉంది. కానీ ఈ టైంలో సోషల్ మీడియాలో కల్కి ఫీవర్‌తో ఊగిపోవాల్సిందని.. కానీ వాతావరణం స్తబ్ధుగా మారిపోయిందని.. 600 కోట్ల సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజవుతున్న ఫీలింగే కనిపించట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రోమోలు నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాయి తప్ప.. హైప్ క్రియేట్ చేసేలా లేవని.. ప్రమోషన్ల పరంగా రెగ్యులర్ యాక్టివిటీ అన్నదే కనిపించడం లేదని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఆ మధ్య బుజ్జి అనే క్యారెక్టర్ గురించి కొంత హడావుడి చేశారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేసినపుడు కొంచెం సందడి కనిపించింది. అంతే తప్ప వేరే ప్రమోషనల్ కంటెంట్ ఏదీ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయలేదు. తాజాగా రిలీజ్ చేసిన భైరవ యాంథెమ్ నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేలా ఏ కంటెంట్ రావట్లేదని.. బయట ఈవెంట్లు చేయకపోవడం ఒక లోపమైతే.. సోషల్ మీడియాలో కూడా ప్రమోషనల్ క్యాంపైన్ అన్నదే కనిపించడం లేదని… ఎంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఏం లాభం, ప్రమోట్ చేసి జనాలకు చేరువ చేయనపుడు అంటూ వైజయంతీ మూవీస్‌ టీం, దర్శకుడు నాగ్ అశ్విన్‌ మీద మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.