కెజిఎఫ్ హీరో లండన్ దుకాణం

కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకున్న హీరో యష్ ప్రస్తుతం టాక్సిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా షూటింగ్ ముప్పాతిక శాతం లండన్ లో తీయబోతున్నారు. మొత్తం 200 రోజుల షెడ్యూల్స్ లో 150 రోజులు అక్కడే ప్లాన్ చేసినట్టు సమాచారం. యష్ తో పాటు సోదరిగా నటిస్తున్న నయనతార ఇందులో భాగం పంచుకుంటోందని తెలిసింది. గోవా మాదకద్రవ్యాల నేపథ్యంలో చాలా ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న టాక్సిక్ లో హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తోంది కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

ఇంత సుదీర్ఘమైన లండన్ దుకాణం అంటే ఇదేదో ఆషామాషీ వ్యవహారంలా లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రమాదరకమైన డ్రగ్స్ తో వ్యాపారం చేసే ముఠాతో యష్, నయన్ లు సంయుక్తంగా చేసే పోరాటం ఆధారంగా గీతూ మోహన్ దాస్ డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారట. దీని కోసమే యష్ ప్రత్యేకంగా గన్ షూటింగ్ నేర్చుకోవడానికి వర్క్ షాప్ లో పాల్గొన్నాడు. కెజిఎఫ్ ని మించిన యాక్షన్ విజువల్స్ ఇందులో పొందుపరుస్తారట. కమర్షియల్ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ చెప్పిన నెరేషన్ విని నిర్ణయం తీసుకోవడానికి యష్ ఏడాదికి పైగా టైం తీసుకున్నాడు.

వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదలని లక్ష్యంగా పెట్టుకున్న టాక్సిక్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా చూడాలని యూనిట్ ప్రయత్నిస్తోంది కానీ పూర్తయితే తప్ప ప్యాన్ ఇండియా సినిమాలు ఇచ్చిన మాట మీద ఉంటాయో లేదో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. విలన్ ఇతర క్యాస్టింగ్ కి సంబంధించి వివరాలను టీమ్ చాలా గుట్టుగా ఉంచుతోంది. బడ్జెట్ సైతం రెండు వందల కోట్లకు దగ్గరగా ఉంటుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కెజిఎఫ్ ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న యష్ నిదానమే ప్రధానం సూత్రంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే వేగంగా సినిమాలు చేసే ఉద్దేశంలో మాత్రం లేడు.