రష్మిక అంత టార్చర్ అనుభవించిందా?

కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది రష్మిక మందన్నా. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన పుష్ప, పుష్ప-2, యానిమల్, ఛావా చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించింది. కొన్నేళ్లుగా ఇండియన్ స్క్రీన్ మీద తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న ఆమె.. ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడింది.

ఇలా చాలా హ్యాపీగా ఉన్న సమయంలో రష్మిక గురించి అనవసర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. రష్మిక తల్లికి సంబంధించిన 8 ఏళ్ల నాటి ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద సీరియస్ అయిన రష్మిక.. పాత విషయాలను సామాజిక మాధ్యమాల్లోకి తెచ్చి ఇబ్బంది పెట్టడం గురించి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే ఈ పోస్టులను సోషల్ మీడియా నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.

ఇంతకీ ఆ ఆడియోలో రష్మిక తల్లి ఏమందన్నది ఆసక్తికరం. ‘కిరిక్ పార్టీ’ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టితో రష్మికకు ఎనిమిదేళ్ల కిందట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికి రష్మిక వయసు 19 ఏళ్లే. రక్షిత్‌కు అప్పటికే 32 ఏళ్లు వచ్చాయి. ఐతే ఈ రిలేషన్‌షిప్‌లో రష్మిక ఏమాత్రం సంతోషంగా లేదని.. రక్షిత్ కుటుంబం పెట్టిన ఆంక్షలతో బాగా ఇబ్బంది పడిందని.. తన తల్లి ఆడియో కాల్‌ను బట్టి అర్థమవుతోంది.

‘గీత గోవిందం’ సినిమాలో లిప్ లాక్ సీన్ చేసినందుకు.. రక్షిత్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని.. ఇందుకు ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టి తాను పెళ్లి తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిందని.. అంతేకాక రక్షిత్ కుటుంబానికి రష్మిక తల్లి క్షమాపణ చెప్పాలని కూడా షరతు పెట్టిందని ఈ ఆడియో కాల్ ద్వారా అర్థమవుతోంది.

ఆ సమయంలో రష్మికకు రక్షిత్ ఎంతమాత్రం మద్దతుగా నిలవలేదని.. అతడి తల్లి రష్మికతో, ఆమె కుటుంబంతో చాలా దురుసుగా వ్యవహరించిందని.. ఈ ఆడియో క్లిప్ స్పష్టం చేసింది. మొత్తంగా చిన్న వయసులో తెలిసీ తెలియక రక్షిత్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక.. దాని వల్ల చాలా ఇబ్బంది పడిందని.. అందుకే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని తనకు నచ్చినట్లు కెరీర్‌ను తీర్చిదిద్దుకుందని రష్మిక అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో ముందు రక్షిత్ బాధితుడంటూ అతడి మీద సానుభూతి చూపిస్తూ, రష్మికను ఎటాక్ చేసేవాళ్లు కన్నడ జనం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న క్లిప్ చూశాక పరిస్థితి అందుకు విరుద్ధమని అర్థమవుతోంది.