గేమ్ ఛేంజర్ ఆటలో కొత్త చిక్కుముడి

మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్నప్పటికి ఇంకా విడుదల తేదీని ఖరారు చేసుకోవడంలో మల్లగుల్లాలు పడుతున్న గేమ్ ఛేంజర్ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉంది. దర్శకుడు శంకర్ ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజానికి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు టార్గెట్. ఎలాగూ దేవర దసరా నుంచి తప్పుకుని సెప్టెంబర్ 27కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది అడ్వాంటేజ్ గా వాడుకునే ఛాన్స్ ఉంది. అదే నెలలో రజనీకాంత్ వెట్టయాన్ ఉన్నప్పటికీ రెండు వారాలు గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలనేది ఆయన మనసులో ఉందట.

కానీ శంకర్ ఏదీ చెప్పడం లేదు. భారతీయుడు 2 విడుదలకి ఇంకో నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉన్నా ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. బజ్ తక్కువగా ఉన్న విషయంగా లైకా సంస్థ ఆందోళన చెందుతోందని చెన్నై మీడియా రిపోర్ట్. పైగా అనిరుద్ రవిచందర్ ఆల్బమ్ మీద మిశ్రమ స్పందన వచ్చిందే తప్ప హైప్ పెంచడానికి ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో శంకర్ టీమ్ ఎలాంటి ప్రమోషన్లకు ప్లాన్ చేస్తుందో అంతు చిక్కడం లేదు. కొంపతీసి ముందు లాక్ చేసుకున్న జూలై 12 కాకుండా పుష్ప 2 ది రూల్ వదిలేసుకున్న ఆగస్ట్ 15కి వెళ్లిందంటే మాత్రమే అదింకో తలనెప్పి.

పోనీ ఈ గోలంతా ఎందుకని ప్రశాంతంగా డిసెంబర్ వెళ్లిపోదామన్నా పుష్ప కూడా క్రిస్మస్ నే లక్ష్యంగా పెట్టుకుందన్న వార్తలు మెగా ఫ్యాన్స్ ని కలవరపరుస్తున్నాయి . పైగా నితిన్ రాబిన్ హుడ్, నాగచైతన్య తండేల్ ఆల్రెడీ 20కి రావాలని అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. గేమ్ ఛేంజర్, పుష్ప 2 నిర్మాతలు డేట్ కి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ చిక్కుముడి వీడదు. గేమ్ చేంజర్ మోక్షం కలిగిస్తేనే రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సెట్లో అడుగు పెట్టగలడు. చిరంజీవి విశ్వంభర కారణంగా అసలు 2025 సంక్రాంతి ఆప్షన్ లేకుండా పోయింది. లేదంటే పండక్కే వచ్చేయొచ్చు.