నివేదా ‘పరువు’ నిలబడిందా

ఈ మధ్య పేరున్న నటీనటుల వెబ్ సిరీస్ లు పెద్ద హడావిడి లేకుండా సైలెంట్ గా రిలీజైపోతున్నాయి. వాటిలో పరువు ఒకటి. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డ్ బాక్స్ బ్యానర్ పై రూపొందిన ఈ ఎనిమిది ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించగా నరేష్ అగస్త్య, నాగబాబు ముఖ్యమైన సపోర్టింగ్ రోల్స్ చేశారు. కొద్దిరోజుల క్రితం నివేదా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వీడియోని వైరల్ చేశారు కదా. అది దీని కోసమే. పవన్ సాధినేని పర్యవేక్షణలో సిద్దార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

టైటిల్ లోనే కాన్సెప్ట్ చెప్పేశారు. వేరే కులానికి చెందిన సుధీర్ (నరేష్ అగస్త్య) ను పెళ్లి చేసుకున్నందుకు పల్లవి (నివేదా పేతురాజ్) ని స్వంత కుటుంబ సభ్యులు దూరంగా పెడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత పెదనాన్న చనిపోయాడని తెలిసి తీసుకెళ్లడానికి వచ్చిన బావ చందు (సునీల్ కొమ్మిశెట్టి) తో కలిసి భర్తతో పాటు ఊరికి బయలుదేరుతుంది. అయితే మధ్యలో జరిగిన ఒక అనూహ్య సంఘటన వల్ల చందూ చనిపోతే ఆ శవాన్ని దాచడం కోసం పల్లవి, సుధీర్ ఆట మొదలవుతుంది. ఇంకోవైపు ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) తో పాటు మరికొందరి ప్రమేయం ఇందులో ఉంటుంది. అదే అసలు కథ.

దృశ్యం తరహా థ్రిల్లింగ్ ట్రీట్ మెంట్ రాసుకున్న పరువులో మొదటి ఎపిసోడ్ కొంచెం నెమ్మదిగా మొదలై అంతగా ఆకట్టుకోలేకపోయినా అసలు క్రైమ్ మొదలయ్యాక వేగం పుంజుకుంటుంది. చందూ బాడీని మాయం చేయడానికి పడే పాట్లతో మొదలుపెట్టి దానికి ఇంకో కులాంతర హత్యకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఎక్స్ ట్రాడినరి అనిపించే టేకింగ్ లేకపోయినా మరీ విసుగెత్తకుండా నడిపించడంలో ఓ మోస్తరుగా సక్సెసయ్యారు దర్శకులు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దన్నుగా నిలిచింది. అయిదు గంటలకు పైగా మొత్తం నిడివి ఉన్న పరువుని తీరిక, టైం ఎక్కువ ఉంటే ఓ లుక్కేయొచ్చు.