వదినమ్మ ప్రేమ ముందు పెన్ను ఖరీదు ఏపాటి

కనీసం రెండు రోజులకోసారి అభిమానులకు కిక్కిచ్చే వీడియో రానిదే సోషల్ మీడియాలో పొద్దు గడవడం లేదు. అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీటికి అలవాటు పడి మా పనులు మేం చేసుకోవాలా లేక ఉదయం నుంచి రాత్రి దాకా ఇవి చూసుకుంటూ మురిసిపోవాలా అంటూ సుతారంగా తమ హీరోని మందలిస్తున్నారు. ఇలా అనుకుంటూ ఉండగా మరొకటి వచ్చేసింది. వదినమ్మ సురేఖ మరిది పవన్ కు స్వయంగా ఒక పెన్నుని బహుమతిగా అందజేసి తర్వాత అన్నయ్య చిరంజీవి, భార్య అన్నా సమక్షంలో ఒక తీపి జ్ఞాపకాన్ని భద్రపరుచుకోవడం సగటు జనాలను సైతం కదిలించేలా ఉంది.

ఇంతకీ ఆ పెన్ను విశేషమేంటో చూద్దాం. సుప్రసిద్ధ మౌంట్ బ్లాంక్ కంపెనీ తయారు చేసిన వాల్ట్ డిస్నీ స్పెషల్ ఎడిషన్ ఇది. దీని ఖరీదు ఆన్ లైన్ ఇండియన్ సైట్ల ధరలో అక్షరాలా 2 లక్షల 53 వేల రూపాయల పై చిలుకు చూపిస్తోంది. కొన్ని ఓవర్సీస్ సైట్స్ లో ఎలాంటి ప్రత్యేకమైన ప్యాకింగ్ లేనిది 985 డాలర్లు ఉంది. అలా చూసుకున్నా 90 వేల రూపాయల పైమాటే. రేటుదేముంది కానీ తల్లిలా అభిమానించే వదిన ఇంత ప్రేమగా ఇచ్చిన కానుకకు వెలకట్టడం సాధ్యమా. ఈ మధుర క్షణంలో భాగమవుతున్నప్పుడు చిరు కళ్ళలో ఆనందం గురించి చెప్పేదేముంది. కెమెరాకు దొరకని తడి ఉండనే ఉంది.

ఇప్పుడీ కలం ఏమేం రాస్తుందో, ఎవరి తలరాతలు మారుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయితీరాజ్ లాంటి కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇకపై రాజకీయంగా చాలా బిజీ కాబోతున్నారు. రోజూ పదులు సంఖ్యలో అధికారిక దస్త్రాల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఈ పెన్నుతో చేస్తాడో లేక జీవిత కాలం జ్ఞాపకం కాబట్టి ఇంట్లో శాశ్వతంగా భద్రపరుస్తాడో చూడాలి. ప్రస్తుతం అభిమానులకు జనసేన అధ్యక్షుడి రాజకీయ విషయాలు తప్ప కొంత కాలం సినిమాలను మర్చిపోయేలా ఉన్నారు. జనసేన విజయం అలాంటిది మరి.