యేవమ్ రిపోర్ట్ ఏంటి

నిన్న చాందిని చౌదరి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయి. ఒకటి మ్యూజిక్ షాప్ మూర్తి. డీసెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వచ్చింది. రెండోది యేవమ్.

హీరో నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలుగా ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హరోంహర, మహారాజ లాంటి నోటెడ్ రిలీజుల మధ్య రావడంతో ఇది వచ్చిన సంగతే సగటు ప్రేక్షకులకు గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్ జరిగింది ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో కంటెంట్ బేస్ చేసుకున్న మూవీ అనే అభిప్రాయం కలిగించింది. మరి ఫైనల్ గా రిపోర్ట్ ఏంటో చూద్దాం.

వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు ట్రైనీగా వస్తుంది ఎస్ఐ సౌమ్య(చాందిని చౌదరి). డ్యూటీనే ప్రాణంగా భావించే ఇంచార్జ్ అభిరాం (భరత్ రాజ్) తో మంచి దోస్తీ కుదురుతుంది. స్టార్ హీరోల పేర్లను వాడుకుని అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసే సైకో యుగంధర్ (వశిష్ట సింహ) ను పట్టుకోవడం డిపార్ట్ మెంట్ కు పెద్ద సవాల్ గా మారుతుంది. ఇది పరిష్కరిస్తే తన ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని భావించిన సౌమ్య ఒంటరిగా అతని దగ్గరికి వెళ్లే రిస్క్ చేస్తుంది. అసలు ట్విస్టు ఇక్కడ మొదలవుతుంది. నగరంలో జరిగే నేరాల వెనుక అసలు ముసుగు మరొకటి ఉందని అర్థమవుతుంది. అదేంటనేది తెరమీద చూడాలి.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకుని దానికి సెలబ్రిటీ సోషల్ మీడియా ట్రాప్ ని జోడించిన దర్శకుడు ప్రకాష్ దంతులూరి యేవమ్ స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు. తను గొప్పగా అనుకున్న ట్విస్టులను సరైన రీతిలో పేర్చుకోకపోవడంతో సస్పెన్స్ ని ముడివిప్పే తీరు చప్పగా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ లోనే పలు సందర్భాల్లో చేతులెత్తేయడంతో ఇంటర్వెల్ బ్లాక్ సైతం తేలిపోయింది.

సెకండాఫ్ లో అక్కడక్కడా టెంపో చూపించినప్పటికీ మిగిలిన తప్పులను క్షమించడానికి అది సరిపోలేదు. చాందిని చౌదరి కూడా అంతగా నప్పలేదు. ఎంత ఓపిక తెచ్చుకున్నా సరే చివరికి యేవమ్ కష్టమ్ అనిపించేసింది.