నాని శ‌నివారం.. విష్ణు సోమ‌వారం

త‌న కొత్త చిత్రానికి స‌రిపోదా శ‌నివారం అనే టైటిల్ పెట్టుకున్న నేచుర‌ల్ స్టార్ నాని.. ఆ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ అయినా శ‌నివార‌మే రిలీజ‌య్యేలా చూసుకుంటున్నాడు. సినిమా అనౌన్స్‌మెంట్, టీజ‌ర్ లాంచ్ శ‌నివార‌మే జ‌రిగాయి. గ‌త శ‌నివారం ఫ‌స్ట్ సింగిల్ గురించి అప్‌డేట్ ఇవ్వ‌గా.. ఈ శ‌నివారం పాట లాంచ్ చేస్తున్నారు. ఇదో ర‌క‌మైన ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీగా మారింది.

ఇప్పుడు మంచు విష్ణు కూడా ఇదే బాట‌లో న‌డుస్తున్నాడు. త‌న కొత్త చిత్రం క‌న్న‌ప్ప‌కు సంబంధించి అప్‌డేట్స్ అన్నీ ఇక‌పై సోమ‌వార‌మే ఇవ్వ‌బోతున్న‌ట్లు విష్ణు ప్ర‌క‌టించాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను శుక్ర‌వారం లాంచ్ చేశారు కానీ.. ఇక ముందు మాత్రం అప్‌డేట్స్ సోమ‌వారం ఉంటాయ‌ని విష్ణు ప్ర‌క‌టించాడు.

క‌న్న‌ప్ప అనేది శివ‌భ‌క్తుడి క‌థ‌. సోమ‌వారం శివుడికి ప్ర‌త్యేక‌మైన‌ రోజ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే సోమ‌వారాల్లోనే సినిమా విశేషాలు పంచుకోవాల‌ని క‌న్న‌ప్ప టీం నిర్ణ‌యించింది. లాంచ్ అయిన టీజ‌ర్ చూస్తే క‌న్న‌ప్ప ఒక విజువ‌ల్ వండ‌ర్‌లా ఉండ‌బోతోంద‌ని అర్థ‌మైంది. యాక్ష‌న్ ఘ‌ట్టాలు హైలైట్‌గా నిలిచిన టీజ‌ర్లో.. ప్ర‌త్యేక పాత్ర‌లు పోషించిన ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్, కాజ‌ల్‌ల‌ను చూపించి చూపించ‌న‌ట్లు చూపించి అభిమానుల‌ను ఊరించారు.

జులై నుంచి సోమ‌వారాల్లో వీరి పాత్ర‌ల విశేషాలు, లుక్స్ పంచుకోనుంది టీం. ఈ చిత్రాన్ని ఏడాది చివ‌ర్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది టీం. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌భాస్‌కు చూపిస్తే తాను ఊహించుకున్న దాని కంటే వేరే స్థాయిలో ఉంద‌ని.. గ‌ట్టిగా కొట్ట‌బోతున్నార‌ని ప్ర‌భాస్ వ్యాఖ్యానించిన‌ట్లుగా మంచు విష్ణు చెప్ప‌డం విశేషం.