ర‌వితేజ చేయాల్సిన రీమేక్.. చివ‌రికి

మాస్ రాజా ర‌వితేజ కొన్నేళ్ల కింద‌ట ఓ త‌మిళ హిట్ మూవీ మీద అమిత‌మైన ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించాడు. దాని రీమేక్‌లో న‌టించాల‌ని అనుకున్నాడు. ఆ సినిమానే.. బోగ‌న్. జ‌యం ర‌వి, హ‌న్సిక‌, అర‌వింద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్ర‌మిది. ల‌క్ష్మ‌ణ్ అనే ద‌ర్శ‌కుడు దీన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి.

ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌.. ర‌వితేజ‌తో కొన్ని సిట్టింగ్స్ కూడా వేశాడు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ ప‌ట్టాలెక్క‌డం ప‌క్కా అనుకున్న త‌రుణంలో ఉన్న‌ట్లుండి ర‌వితేజ వెన‌క్కి త‌గ్గాడు. కొన్ని నెల‌ల పాటు ర‌వితేజ‌తో ట్రావెల్ అయి.. చివ‌రికి సినిమా క్యాన్సిల్ అయ్యేస‌రికి లక్ష్మ‌ణ్ హ‌ర్ట‌య్యాడు. త‌మిళ మీడియాలో దీనిపై అసంతృప్తిని కూడా వ్య‌క్తం చేశాడు.

బోగ‌న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న నిర్మాత రామ్ తాళ్లూరి. అది వ‌ర్క‌వుట్ కాక ర‌వితేజ‌తో త‌ర్వాత నేల టిక్కెట్టు తీశాడు. అది డిజాస్ట‌ర్ కాగా.. మ‌ళ్లీ ఆ హీరోతోనే డిస్కో రాజా చేశాడు. అదీ డిజాస్ట‌రే. వీటి బ‌దులు బోగ‌న్ రీమేక్ చేసి ఉంటే ఫ‌లితం మెరుగ్గా ఉండేదేమో.

ఐతే అప్ప‌ట్లో రీమేక్ హ‌క్కులు తీసుకున్న వేస్ట‌యిపోకూడ‌ద‌నో ఏమో.. రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆ చిత్రాన్ని అనువాద రూపంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం విశేషం. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా చేశారు. బోగ‌న్ పేరుతోనే ఈ సినిమా త్వ‌ర‌లోనే తెలుగులో రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. బ‌హుశా ఓటీటీలో డ‌బ్బింగ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఆహాలో బోగ‌న్ తెలుగువెర్ష‌న్ రిలీజ్ చేస్తుండొచ్చ‌ని భావిస్తున్నారు.