మలయాళ సీమలో సమంతా ఎంట్రీ

ఈమధ్య సినిమాల్లో కనిపించడం బొత్తిగా తగ్గించేసిన సమంతకు ఆఫర్లు వస్తున్నాయి కానీ తనే ఒకపట్టాన ఒప్పుకోవడం లేదని ఫిలిం నగర్ టాక్. కథ నచ్చకో లేక కాంబో సరిపోకో ఏదైతేనేం చివరికి స్వంతంగా ప్రొడక్షన్ పెట్టేసి మా ఇంటి బంగారంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

చిన్న ప్రీ లుక్ పోస్టర్ లాంటిది ఆ మధ్య వదిలారు కానీ అంతకు మించి డీటెయిల్స్ ఇప్పటిదాకా బయట పెట్టలేదు. వరుణ్ ధావన్ తో చేసిన సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. సరైన సీజన్ చూసి ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ చేయాలనీ అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేసుకుంటోంది.

ఇదిలా ఉండగా సమంతా మలయాళం ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు టాక్. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ థ్రిల్లర్ కి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ జంట గతంలో ఒక కమర్షియల్ యాడ్ చేసింది కానీ తెరమీద కనిపించడం ఇదే మొదటిసారి. తనకు ఏ మాయ చేసావే రూపంలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన గౌతమ్ మీనన్ అంటే సామ్ కు ప్రత్యేక అభిమానం. ఆ కారణంగానే కంటెంట్ లో బలం లేకపోయినా ఎర్ర గులాబీలు క్యామియో చేసింది. అది వచ్చిన సంగతే ఎవరికీ గుర్తు లేనంత ఫ్లాప్ అయ్యింది.

ఇప్పుడు చేయబోయే మూవీ మమ్ముట్టి స్వీయ నిర్మాణంలో ఉంటుందని సమాచారం. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టి తక్కువ షెడ్యూల్స్ లో పూర్తి చేసేలా గౌతమ్ మీనన్ పక్కాగా ప్లాన్ చేశారట. క్రేజీ కలయిక కాబట్టి తెలుగు తమిళంలోనూ వస్తుంది.

ఇక టాలీవుడ్ సంగతికొస్తే 2019లో ఓ బేబీతో సూపర్ హిట్ అందుకున్నాక సమంతకు సరైన సక్సెస్ లేకుండా పోయింది. జాను, శాకుంతలం దారుణంగా పోయాయి. ఖుషి కష్టం మీద గట్టెక్కింది కానీ బెస్ట్ కాలేదు. యశోద ఒకటే కొంచెం ఊరట కలిగించింది. మరి ఇకనైనా స్పీడ్ పెంచుతుందో లేక నిదానమే ప్రధానం సూత్రంతో మెల్లగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.