బాహుబలి తర్వాత సాహోకి విపరీతమైన గ్యాప్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత రాధేశ్యామ్ కు అదే ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనివల్ల ఏడాదికి కనీసం ఒక్క సినిమా చూడలేకపోతున్నామని అభిమానులు తెగబాధ పడుతూ వచ్చారు. అందుకే మొన్నటి ఏడాది ప్రభాస్ ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై సంవత్సరానికి మూడు రిలీజులు ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. నిజానికి ఆ మాట నమ్మనివాళ్ళే ఎక్కువ. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలకు రెండేళ్లకు ఒక మూవీ చేయడమే పెద్ద ప్రాణసంకటంగా మారింది. అలాంటప్పుడు ట్రిపుల్ ధమాకా అంటే జరగని పని.
కానీ ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 2023 జూన్ నుంచి 2024 జూన్ దాకా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పన్నెండు నెలల కాలంలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. గత ఏడాది జూన్ లో ఆదిపురుష్, డిసెంబర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చాయి. ఇప్పుడు తిరిగి జూన్ లోనే కల్కి 2898 ఏడి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్ రేంజ్ స్టార్ హీరోలను ఎవరిని చూసుకున్నా ఇంత వేగంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు దరిదాపుల్లో కనిపించరు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఎవరిది చూసినా అందరికి ఏళ్లకేళ్లు గ్యాప్ ఉన్న ఒకే కథ.
ఇకపై కూడా ప్రభాస్ జోరు తగ్గించే మూడ్ లో లేడు. సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడిల పీరియాడిక్ డ్రామా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతీ ది రాజా సాబ్ ఎట్టి పరిస్థితిల్లో 2024 చివరికల్లా అయిపోవాలి. మధ్యలో ఒకవేళ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, కల్కి 2 కనక లైన్లోకి వస్తే సెట్స్ పైకి వెళ్లనివాటిలో ఏదో ఒకటి ఆలస్యం అవ్వొచ్చు . ఎంత ఒత్తిడిలో ఉన్నా తన నిర్మాతలు సేఫ్ కావాల్సిన అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టు సహకారం ఇస్తున్న ప్రభాస్ ఇదే వేగాన్ని ఇకపై కూడా కొనసాగించే ఉద్దేశంలో ఉన్నాడని సన్నిహితుల మాట. ఫ్యాన్స్ కి కావాల్సింది కూడా అదేగా.