యానిమల్ పుణ్యం రాక్ స్టార్ భీభత్సం  

యానిమల్ పుణ్యం రాక్ స్టార్ భీభత్సం

మాములుగా ఒక రీ రిలీజు సినిమాకు ఒకటి రెండు రోజులు హడావుడి ఉండటం సహజం. ఆ తర్వాత చల్లారిపోతుంది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే యూట్యూబ్, ఓటిటిలో సులభంగా దొరుకుతున్న ట్రెండ్ లో అదే పనిగా వాటిని థియేటర్లకు వెళ్లి చూసే వాళ్ళు రోజు ఉండరు.

కానీ బాలీవుడ్ మూవీ రాక్ స్టార్ మాత్రం దీనికి భిన్నంగా దూసుకుపోతోంది. గత వారం పునఃవిడుదల జరుపుకున్న రన్బీర్ కపూర్ మ్యూజికల్ డ్రామాకి ఆదరణ ఎంత మాత్రం తగ్గడం లేదు. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ద్వారా 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. నలభై లక్షల గ్రాస్ దాటేసింది.

ఇది యానిమల్ ప్రభావం వల్ల అంటే కాదనలేం. ఎందుకంటే రాక్ స్టార్ 2011లో వచ్చింది. అప్పుడు స్కూల్ వయసులో ఉన్న ఫ్యాన్స్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొంది ఉండరు. కానీ అదే కుర్రకారు ఇప్పుడు టీనేజ్ లో యానిమల్ ని విపరీతంగా ఎంజాయ్ చేసింది. సో ఆ ప్రభావం రాక్ స్టార్ మీద పడింది.

ఇంతియాజ్ అలీ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ కట్టిపడేసే మ్యూజిక్ వెరసి హౌస్ ఫుల్స్ తో షోలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ లో రోజుకు కనీసం ఆరేడు షోలు వేస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 112 రూపాయల టికెట్ ధర దీనికి బాగా దోహదం చేస్తోంది.

ఫైనల్ రన్ అయ్యేలోపు ఎంతలేదన్నా అయిదారు కోట్ల గ్రాస్ కి ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఇంత వసూలు చేసిన రీ రిలీజ్ సినిమా మరొకటి లేదు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న రన్బీర్ కపూర్ కు మన సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ప్రమోషన్ మామూలుది కాదు.

రన్బీర్ కపూర్ డేట్లు కనీసం మూడేళ్లు దొరకని స్థాయికి చేరుకున్నాడు. అంతకు ముందే స్టార్ డం ఉన్నప్పటికీ యానిమల్ పెంచిన రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాక్ స్టార్ ప్రభంజనం కన్నా వేరే ఉదాహరణ ఇంతకంటే ఏం కావాలి.