రామోజీరావు బయోపిక్ చదువుకోవచ్చు

గొప్ప వ్యక్తుల జీవితాలను తెరమీద చూపించే క్రమంలో ఇప్పటిదాకా స్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల కథలు సినిమాలుగా వచ్చాయి. మహానటి లాంటివి అద్భుత విజయం సాధిస్తే తలైవి లాంటివి పరాజయం పాలయ్యాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్త తరానికి మహనీయుల గాథలు చెప్పడం అవసరం.

ఈ రోజు నింగికేగిన మీడియా మేరు పర్వతం రామోజీరావు గురించి ప్రస్తుతం అలాంటి చర్చే జరుగుతోంది. ఒక సాధారణ దినపత్రికతో మొదలుపెట్టి దాన్ని అత్యధిక సర్కులేషన్ దాకా తీసుకెళ్లి ఏషియాలోనే అత్యంత పెద్దయిన రామోజీ సిటీ నిర్మాణం దాకా ఆయన జీవితంలో లెక్కలేనన్ని ఒడిదుడుకులు ఉన్నాయి.

భవిష్యత్తులో ఎవరు సినిమాగా మలుస్తారో చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడు ఆయన లైఫ్ ని చదువుకోవాలంటే మాత్రం ఒక అవకాశం ఉంది. 2011లో ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థులు రామోజీరావు ల్యాండ్ మార్క్ పుట్టినరోజుని పురస్కరించుకుని ’75 వసంతాల వెలుగు’ పేరుతో ఒక బుక్కుని పబ్లిష్ చేశారు.

291 పేజీలతో ఇందులో సమగ్ర సమాచారం ఉంది. 1936 కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పుట్టిన ఆయన తొలి ఇల్లు జ్ఞాపకంతో మొదలుపెట్టి తల్లి తండ్రులు, పూర్వీకులు, స్కూల్ చదువు, కళాశాల విద్య, ఉద్యోగం, వివాహం, హైదరాబాద్ రావడం, తొలి సంతానం లాంటి వ్యక్తిగత విశేషాలు ఎన్నో పొందుపరిచారు.

ఈనాడు స్థాపన, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్, ఎరువుల వ్యాపారం, సితార – అన్నదాత – విపుల – చరిత పత్రికల ఆవిర్భావం, ఉషాకిరణ్ మూవీస్ ప్రస్థానం, ఎన్టీఆర్ తీర్పులో క్యామియో చేయడం, ఈటీవీ ఆవిష్కరణ ఇలా బోలెడు సంగతులు అరుదైన ఫొటోలతో సహా ఇచ్చారు.

అంతే కాదు రామోజీరావు సంస్థలో పనిచేసిన వాళ్ళ అనుభవాలు, ఆయన స్ఫూర్తితో గొప్ప స్థాయికి చేరుకున్న విజేతల కథలు బోలెడున్నాయి. ఆశ్చర్యం కలిగించే ఎప్పుడూ చూడని ఛాయాచిత్రాలు బోలెడు చూసుకోవచ్చు. ఇప్పుడు అంత సులభంగా దొరకదు కానీ ఓపిగ్గా వెతికి పట్టుకుంటే రామోజీ జీవితంలో తొంగి చూడొచ్చు. 2021లో ఈనాడులో పని చేసిన గోవిందరాజు సి చక్రధర్ రాసిన ‘రామోజీరావు ఉన్నది ఉన్నట్టు’ పుస్తకం మరో చక్కని విజ్ఞానఖని.