నిన్న విడుదలైన సినిమాల్లో అధిక శాతం దృష్టి శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ మీద ఉన్నప్పటికీ తర్వాత యూత్ కొంత అటెన్షన్ పెట్టిన మూవీ లవ్ మౌళి. సోలో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి స్టార్ల చిత్రాల్లో భాగం పంచుకుంటున్న నవదీప్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఉద్దేశంతో దీన్ని చేశాడు.
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్లకు అసోసియేట్ రచయితగా పని చేసిన అవనీంద్రకు ఇది డెబ్యూ. నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకున్నా పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్ తదితర కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ప్రమోషన్లలో డిఫరెంట్ గా అనిపించిన లవ్ మౌళి తెరమీద ఎలా ఉన్నాడు.
అనాథయిన మౌళి(నవదీప్) గొప్ప పెయింటర్. ప్రేమంటే అస్సలు నమ్మకం లేక తనదైన సిద్ధాంతాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఓసారి ప్రయాణంలో ఓ అఘోరా(రానా) కలిసి ఉపదేశం చేయడమే కాక విచిత్ర శక్తి ఉన్న బ్రష్ ని కానుకగా ఇస్తాడు.
మౌళి ఎలాంటి లక్షణాలతో ఉన్న అమ్మాయిని కోరుకుంటాడో అదే బొమ్మగా వేస్తే ఆమె నిజంగానే వచ్చే మేజిక్ పవర్ దానికి ఉంటుంది. అలా వచ్చిన అమ్మాయే చిత్ర (పంఖూరి గిద్వాని). కానీ ఇక్కడే అసలు ట్విస్టు మొదలవుతుంది. మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా జరిగే సంఘటనల వల్ల మౌళిలో కొత్త సంఘర్షణ మొదలువుతుంది. అదేంటో తెరమీద చూడాలి.
అవనీంద్ర ప్రేమకు నిజమైన నిర్వచనం ఇవ్వాలనే ఆలోచనతో రొటీన్ పాయింట్ కే ఫాంటసీ జోడించి కొత్తగా ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ ఆసక్తిగా మొదలైన ఇతని నెరేషన్ క్రమంగా మూడు ప్రేమకథలు దాటేలోపు నీరసం తెప్పిస్తుంది.
సన్నివేశాలు మరీ నెమ్మదిగా నడవడం, చాలాసార్లు చూసిన తరహాలోనే స్క్రీన్ ప్లే సాగడం సృజనాత్మకతను తగ్గించేసింది. స్వచ్ఛమైన ప్రేమ గొప్పదనం చెప్పే క్రమంలో అవనీంద్ర అవలంబించిన స్క్రీన్ ప్లే సాగతీతకు గురవ్వడంతో పాటు అవసరానికి మించిన బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీస్ ని దూరం చేసింది. ఓవరాల్ గా లవ్ మౌళి సంతృప్తి కలిగించలేకపోయాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates