క్యూట్ లుక్స్.. చక్కటి నటనతో నిత్యా మీనన్ దక్షిణాది ప్రేక్షకులపై వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’తోనే ఆమె మన ప్రేక్షకుల మనసులు దోచేసింది. నిత్యా ఏదో ఒక ఇమేజ్‌కు, జానర్‌కు పరిమితం కాకుండా అనేక రకాల పాత్రలు, సినిమాలు చేసింది. ఐతే ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. ప్రేమకథల్లో నటిస్తే వాటికి ఉండే ఆకర్షణే వేరు.
‘అలా మొదలైంది’తో పాటు ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఓకే బంగారం లాంటి చిత్రాలతో ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. నిత్యాను ప్రేమకథల్లో చూడ్డానికే తన అభిమానులు ఎక్కువ ఇష్టపడతారు. ఐతే ఏ హీరోయిన్ అయినా యంగ్ ఏజ్‌లో ఉన్నపుడే ప్రేమకథలు చేస్తుంది. తర్వాత పాత్రలు, కథలు మారిపోతాయి.
ఒక హీరోయిన్ పదేళ్లు దాటి ఇండస్ట్రీలో ఉందంటే ప్రేమకథలు తన దగ్గరికి రావడం కష్టమే. అందులోనూ నిత్యా ప్రయోగాత్మక కథలు చాలా చేస్తుంటుంది కాబట్టి క్రమంగా ప్రేమకథా చిత్రాలు తగ్గిపోయాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ ఒక అందమైన ప్రేమకథలో నటిస్తోంది. ఇందులో జయం రవి హీరో. వీళ్లిద్దరి కలయికలో రానున్న సినిమాకు ‘కాదలిక్క నేరమిల్లై’ అని పేరు పెట్టారు. అంటే ‘ప్రేమించడానికి సమయం లేదు’ అని అర్థం. ఇలాంటి పేరు పెట్టి ప్రేమకథ తీయడం విశేషమే.
ఈ చిత్రాన్ని తమిళ నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక డైరెక్ట్ చేస్తుండడం విశేషం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ అందంగా, ఆకర్షణీయంగా ఉండి నిత్య అభిమానుల్లో ఆశలు, అంచనాలు రేకెత్తిస్తోంది. మరి మళ్లీ ప్రేమకథలో నిత్య ఎలా మెరుస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates