దేవరకు సవాల్ విసురుతున్న రజనీకాంత్

జూనియర్ ఎన్టీఆర్ ని సోలో హీరోగా చూసి నాలుగేళ్ళకు పైగా అయ్యిందన్న ఆకలితో అభిమానులు ఎదురు చూస్తున్న దేవర అక్టోబర్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది నెలల క్రితమే అధికారికంగా ఖరారు చేశారు. దానికి అనుగుణంగానే దర్శకుడు కొరటాల శివ ఎలాంటి జాప్యం రాకుండా షూటింగ్ చేస్తున్నారు.

టైటిల్ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయ్యింది. త్వరలో మరొక మెలోడీ డ్యూయెట్ ని వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల ఇంకా దూరంలో ఉన్నప్పటికీ ప్రమోషన్ విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటూ ప్యాన్ ఇండియా రేంజ్ హైప్ వచ్చేలా చూసుకుంటున్నారు.

అన్ని భాషల్లో సమాంతరంగా భారీ రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. అయితే అదే సమయానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విస్టు ఇచ్చేలా ఉన్నారు. టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయన్ ని అక్టోబర్ 10 విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ నిర్ణయించుకుందని తాజా సమాచారం.

దసరా పండగకు లక్ష్యంగా చేసుకుని గత ఏడాది జైలర్ లాగే ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనేది తలైవా మేకర్స్ ప్లాన్. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో దేవరకొచ్చిన ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది

దేవరకు సరిపడా హైప్ ఉన్నా సరే పక్క రాష్ట్రాల్లో రజనితో ధీటుగా స్క్రీన్ కౌంట్ తెచ్చుకోవడం సులభంగా ఉండదు. పైగా సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ కాబట్టి పంపిణి వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. నిజానికి ఎవరో ఒకరు దేవరకు కాంపిటీషన్ వస్తారని తెలుసు కానీ ఇలా రజనితోనే తలపడాల్సి రావడం ఊహించనిది.

సెప్టెంబర్ లో విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్, ఆపై నెల తిరక్కుండానే వెట్టయాన్ రావడం పట్ల కోలీవుడ్ ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. తెలుగులో ఇంకా టైటిల్ నిర్ణయించని రజిని సినిమాలో రానా, అమితాబ్ బచ్చన్ తదితరుల కీలక పాత్రలతో పాటు అనిరుద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా మారుతోంది.