మహేష్‌ భజన అయితే ఓ రేంజిలో ఉంది

బండ్ల గణేష్‌ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. రెండూ మానేసి తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్నా.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

కాంగ్రెస్ పార్టీని ఆకాశానికెత్తేస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తూ మీడియాలో బాగానే హైలైట్ అయ్యాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ బండ్ల చేసిన కామెంట్ ఎంత చర్చనీయాంమైందో తెలిసిందే. ఐతే అంత చేసినా అతడికి టికెట్ మాత్రం రాలేదు.

కట్ చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఘోర పరాభవం చవిచూసింది. కొంత కాలానికే రాజకీయాలకు దండం పెట్టేసి సైలెంటైపోయాడు బండ్ల. ఐతే ఇప్పుడు రూట్ మార్చి కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నాడు.

రోజు రోజుకూ కేసీఆర్ భజనం శ్రుతి మించిపోతుండగా.. దీనిపై కౌంటర్లు పడుతున్నా బండ్ల ఆగట్లేదు. అంతటితో ఊరుకోకుండా సినిమా వాళ్లను కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ని తేడా లేకుండా అందరు హీరోలనూ ఆకాశానికెత్తేస్తున్నాడు.

తాజాగా బండ్ల వ్యవహారం చూస్తే మహేష్ బాబును ప్రత్యేకంగా టార్గెట్ చేశాడనిపిస్తోంది. మహేష్ మీద రోజుకో ట్వీట్ వేస్తున్నాడు బండ్ల. నిన్నేమో మహేష్ ఓ కార్యక్రమంలో నవ్వుతున్న వీడియో పెట్టి.. ‘కల్మషం లేని నవ్వు.. లవ్యూ సార్’ అంటూ ఓ ట్వీట్ వేశాడు.

ఈ రోజేమో.. మహేస్ ఓ ఆడియో వేడుకలో దండం పెడుతున్న ఫొటో పెట్టి ‘నీ సంస్కారానికి నా వందనం’ అంటూ మహేష్‌‌ను ట్యాగ్ చేశాడు. మూడు రోజుల కిందట కూడా మహేష్‌కు కూతురు సితార హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటో పెట్టి ‘ఘట్టమనేని వారి రక్త సంబంధం చూడముచ్చటగా ఉంది’ అంటూ ఓ కామెంట్ చేశాడు.

బండ్ల మిగతా హీరోల్ని కూడా పొగుడుతూ ట్వీట్లు వేస్తున్నాడు కానీ.. మహేష్‌ భజన అయితే ఓ రేంజిలో ఉంది. మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న బండ్ల మహేష్‌ను దువ్వుతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి అతడి భజన చూస్తుంటే.