క్లారిటీ ఇచ్చేసిన కట్టప్ప

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించబోయే సినిమా కోసం భారతీయులు మాత్రమే కాదు.. ఎన్నో దేశాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఆ పనులు కానిస్తూనే కాస్టింగ్ మీద దృష్టిపెట్టింది రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టుల గురించి రోజుకో వార్త బయటికి వస్తోంది. ఈ క్రమంలోనే ‘బాహుబలి’లో కట్టప్పగా ఎక్కడ లేని గుర్తింపు సంపాదించిన సత్యరాజ్ పేరు తెరపైకి వచ్చింది.

‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబుకు తండ్రిగా నటించి మెప్పించిన సత్యరాజ్.. మరోసారి రాజమౌళి, మహేష్ బాబులతో జట్టు కట్టబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారంలో నిజం లేదని సత్యరాజ్ తేల్చేశాడు.

మహేష్ బాబు-రాజమౌళి సినిమా కోసం తనను ఇప్పటిదాకా ఎవ్వరూ సంప్రదించలేదని సత్యరాజ్ తెలిపాడు. ఒకవేళ ఆ సినిమా కోసం తనను అడిగితే ఆనందంగా అంగీకరిస్తానని సత్యరాజ్ తెలిపాడు. ఇక ‘బాహుబలి’లో తనకు వచ్చిన గుర్తింపు గురించి సత్యరాజ్ మాట్లాడుతూ.. తమిళనాడు వరకు తాను సత్యరాజ్‌గానే అందరికీ తెలుసని.. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి తాను కట్టప్పగా పరిచయం అయ్యానని చెప్పారు. ఇందుకు రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. బాహుబలిలో, అలాగే దీనికి సంబంధించిన లేటెస్ట్ యానిమేటెడ్ సిరీస్‌లో చూసి తనకు నిజంగానే అంతేసి కండలున్నాయని అనుకుంటున్నారని.. కానీ అది నిజం కాదని సత్యరాజ్ తెలిపాడు.

మరోవైపు తాను నరేంద్ర మోడీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వచ్చిన ప్రచారం గురించి కూడా సత్యరాజ్ క్లారిటీ ఇచ్చారు. తాను, మోడీ దగ్గరగా అనిపిస్తామని.. అందుకే తమ ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి తాను ఆయన బయోపిక్‌లో నటిస్తున్నట్లు వార్తలు పుట్టించారని.. అంతకుమించి ఇందులో వాస్తవం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషించిన ‘వెపన్’ చిత్రం జూన్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.