పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల నుంచి పూర్తిగా రాజకీయాల మీదే ఫోకస్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి ఆయన ఏ షూటింగ్‌లో పాల్గొనలేదు. చేతిలో ఉన్న మూడు చిత్రాలను హోల్డ్‌లో పెట్టించేసి వాటి నిర్మాతలను వేరే పనులు చూసుకోమన్నారు.
ఇటీవలే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అలాగే ఆయన పార్టీ జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఆ తీపికబురు వినడం కోసం పవన్ ఎదురు చూస్తున్నాడు.
ఎన్నికల ప్రచారంలో బాగా అలసిపోవడంతో ఆయన విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చిన వెంటనే.. పవన్ సినిమాల్లో బిజీ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
కూటమి అధికారంలోకి వస్తే పవన్, ఆయన పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములవుతారా లేదా అన్నది ఆసక్తికరం. ఏదేమైనప్పటికీ కొన్ని రోజులు హడావుడి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక పవన్ నెలకు కొన్ని రోజుల చొప్పున ఒక ఐదారు నెలలు సినిమాల కోసం వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు.
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు.. ఈ మూడు చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ ఆర్డర్లో చివర్లో ఉంటుందనుకున్న ‘హరిహర వీరమల్లు’కే పవన్ ముందుగా డేట్లు ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. దాని బడ్జెట్ చాలా ఎక్కువ.
సినిమా ఆలస్యం కావడం వల్ల నిర్మాత రత్నం చాలా ఇబ్బంది పడ్డాడు. పైగా ఎన్నికల టైంలో ఆయన జనసేన కోసం కూడా పని చేశారు. దీంతో అందరూ అనుకున్నట్లు ముందు ‘ఓజీ’కి కాకుండా ‘హరిహర వీరమల్లు’కే డేట్స్ ఇవ్వబోతున్నారట పవన్. ‘ఓజీ’ని కొన్ని కారణాల వల్ల సెప్టెంబరు 27 నుంచి వాయిదా వేయబోతున్నారన్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఆ చిత్రం కాదని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates