బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమాలో హీరోగా చేసిన కార్తికేయ.. దాని తర్వాత ఐదోదో ఆరోదో సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ పాయల్ అదే సంఖ్యలో సినిమాలు చేసింది. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘మహాసముద్రం’ పట్టాలెక్కబోతోంది. ఇందులో ఓ కథానాయకుడిగా శర్వానంద్ నటిస్తాడని కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోగా తమిళ నటుడు సిద్దార్థ్ నటిస్తాడని వెల్లడించారు. కాబట్టి ఇది మీడియం రేంజ్ మల్టీస్టారర్ అన్నమాట. తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన సిద్ధును ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులోకి హీరోగా తీసుకోవడం విశేషమే. అతను ఈ సినిమాను ఒప్పుకోవడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే తొలి సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చినప్పటికీ.. రెండో సినిమా విషయంలో మంచి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగాడు అజయ్. అతడి కథలో మంచి దమ్ము కనిపించడంతో భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి నిర్మాత అనిల్ సుంకర ముందుకొచ్చాడు. శర్వానంద్ ఇప్పటికే ‘జేకే’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. సిద్ధు ఎలాగూ తమిళుడే ఆయె. దీంతో తమిళంలోనూ ఈ సినిమాను చక్కగా ప్రమోట్ చేసి పెద్ద రేంజిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం రెండు భాషలకూ తెలిసిన హీరోయిన్లు, విలన్లనే పెట్టబోతున్నారు. సిద్ధు తెలుగువారికి కొత్త కాదు కాబట్టి ఇక్కడా సమస్య లేదు. మల్టీస్టారర్, పైగా రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని అజయ్ చూస్తున్నాడు. మరి అతడి ప్లాన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో.. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తనపై నెలకొన్న అంచనాలను అతను ఏమాత్రం అందుకుంటాడో చూడాలి.