ప్రపంచవ్యాప్తంగా సినిమా సమాచారాన్ని విస్తృత స్థాయిలో అందించే ఐఎండీబీ సంస్థ గత దశాబ్ద కాలానికి సినీ ప్రియులు ఐఎండీబీలో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమా తారల వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో పెద్ద పెద్ద స్టార్ హీరోలను వెనక్కి నెట్టి హీరోయిన్ దీపికా పదుకొనే అగ్రస్థానం సాధించడం విశేషం.
2014-2024 కాలానికి భారతీయ సినీ ప్రేమికులు ఐఎండీబీలో అత్యధికంగా వెదికింది దీపిక కోసమేనట. షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో రెండో స్థానం సాధించాడు. టాప్-10లో సౌత్ ఇండియన్ స్టార్స్ ఎవ్వరూ లేరు. ఐశ్వర్యారాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఈ జాబితాలో వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.
సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ సాధించింది సమంతనే కావడం విశేషం. ఆమెకు 13వ స్థానం దక్కింది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడ్డ ఉత్తరాది భామ తమన్నా భాటియా 16వ స్థానం సాధించగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార 18వ స్థానం దక్కించుకుంది.
తెలుగు ఇండస్ట్రీ నుంచి బెస్ట్ ర్యాంక్ సాధించింది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. అతడికి 29వ స్థానం దక్కింది. రామ్ చరణ్ (31) నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్‌కి 35వ ర్యాంకు దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 42వ స్థానంలో నిలవగా.. విజయ్ సేతుపతి 43వ ర్యాంకు సాధించాడు. అల్లు అర్జున్ 47వ స్థానంలో ఉన్నాడు. మోహన్ లాల్ 48వ ర్యాంకులో నిలిచాడు. కమల్ హాసన్ 54వ స్థానంలో ఉంటే. సూర్య 62, జూనియర్ ఎన్టీఆర్ 67 ర్యాంకులు సాధించారు. మహేష్ బాబుకు 72వ ర్యాంకు దక్కింది. అనుష్క 86వ స్థానంలో నిలిచింది. టాప్-100లో ఇంకే టాలీవుడ్ హీరో లేడు.