రాజు యాదవ్ ఎలా ఉన్నాడు

కమెడియన్లు హీరోలు కావడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు కానీ గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన సునీల్ క్యారెక్టర్స్ వైపు వచ్చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో గెటప్ శీనుని హీరోగా లాంచ్ చేయడం సాహసమే. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల ద్వారా సుపరిచితుడైన శీనుకి చిరంజీవి, బ్రహ్మానందం లాంటి సీనియర్లు అండగా నిలబడి తమ వంతుగా ప్రమోషన్ వీడియోలు అందించారు. బన్నీ వాస్ పంపిణి బాధ్యతలు తీసుకోవడం ఆసక్తి రేపింది. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన రాజు యాదవ్ ఇవాళ పోటీలేకుండా థియేటర్లకు వచ్చింది. ఇంతకీ ఎలా ఉన్నాడో చూద్దాం.

మెహబూబ్ నగర్ కు చెందిన మధ్యతరగతి యువకుడు రాజు యాదవ్(గెటప్ శీను) డిగ్రీ తప్పి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు జరిగిన ప్రమాదం వల్ల మొహంలో నవ్వు తప్ప ఇంకే ఎక్స్ ప్రెషన్ పలకని వింత జబ్బుకు లోనవుతాడు. దీని చికిత్సకు లక్షల్లో డబ్బు అవసరమవుతుంది. స్నేహితుడిని స్ఫూర్తిగా తీసుకుని ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమిస్తే లైఫ్ సెటిలవుతుందని భావించి స్వీటీ (అంకిత ఖారత్) వెంటపడతాడు. ఆమె కోసం హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తుతాడు. ఇక్కడే స్వీటీ ఒక ట్విస్ట్ ఇస్తుంది. దీన్ని భరించలేకపోయిన శీను ఏం చేశాడనేది తెరమీద చూడాలి.

భలే భలే మగాడివోయ్ నుంచి హీరోకు ఒక జబ్బో అవలక్షణమో అనుకుని దాని చుట్టూ సన్నివేశాలు పేర్చుకుని అదే కథనుకుంటున్న దర్శకులు పెరిగిపోతున్నారు. పాయింట్ కొత్తగా ఉన్నా దాని చుట్టూ అల్లుకుంటున్న కథనం మరీ తీసికట్టుగా ఉంటే ఏం జరుగుతుందో రాజు యాదవ్ ని ఉదాహరణగా చెప్పొచ్చు. నటన పరంగా గెటప్ శీను బెస్ట్ ఇచ్చినప్పటికీ అదంతా కృష్ణమాచారి రైటింగ్, టేకింగ్ వల్ల నీరుగారిపోయింది. పైగా బేబీ షేడ్స్ స్పష్టంగా కనిపించడం పెద్ద దెబ్బ కొట్టింది.పాటలు, నిడివి పోటీపడి చిరాకు తెప్పిస్తాయి. ఎంటర్ టైన్మెంట్ ఆశించే గెటప్ శీను లాంటి ఆర్టిస్టు మీద ఇలాంటి కాన్వాస్ ని అస్సలు ఊహించలేం, చూడలేం.