అరుదైన కలయికతో ‘మెరుపు కలలు’ జంట

ఎప్పుడో ఇరవై ఏడేళ్ల క్రితం రిలీజైన మెరుపు కలలు సినిమాని సంగీత ప్రియులు అంత సులభంగా మర్చిపోలేరు. ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తెలుగులో అంతగా ఆడలేదు కానీ తమిళంలో ద్విశతదినోత్సవం జరుపుకున్న రికార్డు ఈ క్లాసిక్ కి ఉంది. ప్రభుదేవా, అరవింద్ స్వామి హీరోలుగా అప్పటి బాలీవుడ్ బ్యూటీ కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. దీనికి ఒక టాలీవుడ్ దర్శకుడు శ్రీకారం చుట్టబోతున్నాడు. అతనే నిఖిల్ స్పైకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తేజ్ ఉప్పలపాటి.

ఇందులో ప్రభుదేవా, కాజోల్ 27 సంవత్సరాల తర్వాత జట్టు కట్టారు. ఈ ప్రాజెక్టులో చాలా విశేషాలున్నాయి. సంయుక్త మీనన్, నసీరుద్దీన్ షా, ఆదిత్య సీల్, జిస్సు సేన్ గుప్తా ఇతర కీలక తారాగణం. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చనుండగా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ సైలెంట్ గా జరిగిపోయింది. జవాన్, పుష్ప 2లను పని చేసిన జికె విష్ణు ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ఇది రూపొందనుంది.ఒక దక్షిణాది దర్శకుడికి కాజోల్ ఎస్ చెప్పడం చాలా గ్యాప్ తర్వాత ఇదే. అంతగా కథ నచ్చేసిందట.

ప్యాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు. మరికొందరు స్టార్ యాక్టర్స్ ఇందులో భాగమవుతారని తెలిసింది. ఇంత పెద్ద స్కేల్ లో చరణ్ ప్రాజెక్టుని సెట్ చేసుకోవడం తెరవెనుక గప్ చుప్ గా జరిగిపోయింది. కాజోల్ ప్రస్తుతం మరో మూడో హిందీ సినిమాలతో బిజీగా ఉండగా ప్రభుదేవా ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం గోట్ తో పాటు కన్నప్పలో నటిస్తున్నాడు. మొత్తానికి హడావిడి లేకుండా ఇలా ప్లాన్ చేసుకోవడం బాగుంది. తెరమీద కనిపించడం దాదాపుగా తగ్గించేసిన నసీరుద్దీన్ షా ఎస్ చెప్పారంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే కనిపిస్తోంది.