భలే తెలివైన రీ రిలీజ్ ‘మనం’

నిన్న మనం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కేవలం మూడు కేంద్రాల్లో రీ రిలీజ్ చేయడం ద్వారా తెలివైన స్ట్రాటజీ పాటించి మంచి ఫలితం అందుకున్నారు. నిన్న హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో వేసిన షోకు నాగ చైతన్య, సుప్రియ, విక్రమ్ కె కుమార్ పాటు కుటుంబ సభ్యులు పాల్గొనగా భారీ అభిమాన సందోహం మధ్య గ్రాండ్ ప్రీమియర్ జరిగింది. తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు సన్నివేశాలు వస్తున్నప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ కన్నీళ్లు పెట్టుకున్న వైనం వీడియోల్లో కనిపించింది. ఈ కారణంగానే రాలేకపోయానని సుశాంత్ ట్వీట్ చేశాడు.

ఇదంతా ఒక ఎత్తయితే నాగచైతన్య సమంతల ప్రేమ కథ, పెళ్లి, కుటుంబానికి సంబందించిన సీన్ల సమయంలో ఫ్యాన్స్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. పదే పదే బాల్కనీలో ఉన్న చైతు వైపు చూడటం, గాల్లో పేపర్లు విసిరేయడం, ఈలలు కేకలతో హోరెత్తించడం ఓ రేంజ్ లో సందడి జరిగింది. ఇక క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీకి టాపు లేపేశారు. నాగార్జున సంగతి సరేసరి. గత కొంత కాలంగా వరస ఫ్లాపులతో మునిగితేలుతున్న ఏఎన్ఆర్ హీరోలకు నా సామిరంగ కొంత రిలీఫ్ ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో కాదు. అందుకే తండేల్ మీద మేకింగ్ దశ నుంచే భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.

మనం తెలివైన రీ రిలీజని చెప్పడానికి కారణం లేకపోలేదు. హడావిడిగా తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్లాన్ చేసి, సరైన జనం లేక, ఆశించిన వసూళ్లు రాక ఇబ్బంది పడటం కంటే ఇలా షోలను పరిమితం చేయడం మంచిదే. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లో మాత్రమే షోలు వేయడం ద్వారా మనంని బిజినెస్ మోడల్ లా వాడుకోవాలనే ఉద్దేశం లేదనే సంకేతం స్పష్టంగా ఇచ్చారు. దేవిలో హంగామా వీడియోలను పోస్ట్ చేస్తున్న ఫాన్స్ ఇదయ్యా మీ రేంజ్, త్వరగా సినిమాలు చేయండయ్యా అంటూ నాగ్, చైతు, అఖిల్ లను ట్వీట్ చేస్తూ విన్నపాలు చేయడం గమనార్హం. వాళ్ళ దాకా వెళ్లే ఉంటుంది.