నేను టీ అమ్ముకుంటున్నట్లు రాశారు-లయ

తెలుగు సినిమాలపై బలమైన ముద్ర వేసిన తెలుగు హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ లాంటి సూపర్ హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన లయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద హీరో పక్కనా కథానాయికగా చేసింది. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. 2007లో ఒక ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. తర్వాత చాలా ఏళ్లు లయ కనిపించలేదు.

మధ్యలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి మాయమైన లయ.. ఇప్పుడు నితిన్ మూవీ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. పెళ్లి తర్వాత జీవితం, సినిమాల్లోకి పునరాగమనం చేయడం గురించి మాట్లాడింది. తాను అమెరికాలో ఉన్న టైంలో తన గురించి ఇక్కడి మీడియాలో దుష్ప్రచారాలు జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను పెళ్లి చేసుకుని 2007లో అమెరికాకు వెళ్లిపోయాను. కుటుంబం, పిల్లల కోసం సమయం కేటాయించాలని సినిమాలకు దూరం అయ్యాను. పిల్లలు పెరిగే సమయంలో వారితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఐతే నేను మీడియాకు దూరంగా ఉన్న టైంలో ఏదేదో రాశారు. మనం రోజూ కనిపిస్తూ ఉంటే మన గురించి వచ్చే వార్తలను జనం నమ్మరు. కానీ సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉండడంతో రకరకాల వార్తలు రాశారు. నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదని, నేను టీ అమ్ముకుని బతుకుతున్నానని.. ఇలా దారుణంగా రాశారు. అది చూసి మా కుటుంబం బాధ పడింది. నేను కూడా ఆ వార్తలు చూసి బాధ పడ్డాను. అవేవీ నిజాలు కావు. ఇప్పుడు మా పిల్లలు వాళ్ల పనులు వాళ్లు చేసుకునే స్థితిలో ఉన్నారు. అందుకే మళ్లీ ‘తమ్ముడు’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాను. ఈ సినిమా షూట్ కోసం ఇక్కడే ఉంటున్నా” అని లయ వివరించింది.