ఒక సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా దానికి సంబంధించిన రష్ ఇద్దరు నిర్మాతల దగ్గరుండటం.. ఎవరికి వాళ్లు వేర్వేరుగా టైటిళ్లు పెట్టుకుని విడి విడిగా రిలీజ్‌కు రెడీ అయిపోవడం ఇప్పటిదాకా ఎప్పుడైనా విన్నామా కన్నామా? కానీ తెలుగులో ఓ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. ప్రస్తుత స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో తొలిసారి నటించిన సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’.
సీనియర్ నిర్మాత చంటి అడ్డాల ప్రొడక్షన్లో నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ, కీర్తి సురేష్ జంటగా చాలా ఏళ్ల కిందట మొదలైన సినిమా ఇది. రామ్ ప్రసాద్ రౌతు అనే కృష్ణవంశీ శిష్యుడు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించాడీ చిత్రాన్ని. ఐతే సినిమా చివరి దశలో ఎందుకో షూటింగ్ ఆపేశారు. తర్వాత ఇది వార్తల్లో లేకుండా పోయింది.
కట్ చేస్తే ఈ సినిమాకు ‘జానకితో నేను’ అనే టైటిల్ మార్చి త్వరలో విడుదల చేయబోతున్నట్లు చంటి ఇటీవలే మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అంతలోనే మరో నిర్మాత నట్టి కుమార్ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమా హక్కులు తన దగ్గరున్నాయనే.. తనే ఆ చిత్రాన్ని రిలీజ్ చేస్తానని అన్నాడు. అంతటితో ఆగకుండా ‘ఐనా ఇష్టం నువ్వు’ పేరుతోనే టీజర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ టీజర్ వ్యవహారమంతా తేడాగా ఉంది.
ఒక కాన్సెప్ట్ అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్లు కొన్ని షాట్స్ పేర్చేసి చాలా మొక్కుబడిగా టీజర్ వదిలేశారు. కీర్తికి అస్సలు సెట్ కాని ఎవరో వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఈ టీజర్ చూసిన ఎవ్వరికీ సినిమా చూడాలన్న ఆసక్తి పుట్టేలా అయితే లేదు. ఓవైపు చంటి అడ్డాల టైటిల్ మారుస్తున్నామని, మిగిలిన ఉన్న చిత్రీకరణ కూడా పూర్తి చేయబోతున్నామని, కీర్తి కూడా షూటింగ్‌కు వస్తుందని అంటుంటే.. వివాదాలకు పెట్టింది పేరైన నట్టి కుమార్ ఇలా టీజర్ రిలీజ్ చేయడమేంటో అర్థం కావట్లేదు. చూస్తుంటే అతను ఉన్నదున్నట్లుగా సినిమాను కూడా రిలీజ్ చేసి పడేస్తాడేమో అనిపిస్తోంది. చంటి కూడా వేరుగా రిలీజ్ అంటే పరిస్థితేంటో చూడాలి.