హరోంహర….తెలివైన పని చేసెరా

సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికి మొన్నటిదాకా ఎంత క్లాష్ ఉన్నా సరే నెలాఖరుకే దించాలని నిర్మాతలు ఆలోచించారు కానీ ప్రాక్టికల్ గా పరిస్థితులను విశ్లేషించుకున్నాక పోస్ట్ పోన్ నిర్ణయమే భావ్యమని భావించి ఆ మేరకు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఒకరకంగా ఇది చాలా తెలివైన పని. ఎందుకంటే ఎదురుగా గ్యాంగ్స్ అఫ్ గోదావరిని పెట్టుకుని రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. సితార బ్యానర్, విశ్వక్ సేన్, వయొలెంట్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ హైప్ కి ఉపయోగపడుతున్నాయి.

ఇది కాకుండా సత్యభామ, గంగం గణేశాల గురించి అంత టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ అసలైన గండం మరొకటి ఉంది. జూన్ 4 ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. జనాలు కనీసం ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి పొలిటికల్ మూడ్ లోకి వెళ్ళిపోతారు. పైగా వైసిపి, టిడిపి జనసేన కూటములు గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నాయి. నియోజకవర్గాల వారిగా వందల కోట్ల బెట్టింగులు ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దానికి తోడు ఎవరు అధికారికంలోకి వచ్చినా దాని తాలూకు సంబరాల ప్రభావం జనంలో ఉంటుంది. అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవచ్చు.

ఈ లెక్కన జూన్ 14 చాలా సేఫ్ డేట్ అని చెప్పాలి. సుధీర్ బాబుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. కెరీర్ లో ప్రేమకథా చిత్రం, సమ్మోహనం తప్ప విపరీతంగా కష్టపడిన ఎన్నో సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని బాధపడుతున్న ఈ టాలెంటెడ్ హీరో కాంపిటీషన్ లో రావడం ఎంత మాత్రమె క్షేమకరం కాదు. అలా అని హరోంహరకు పోటీ ముప్పు పూర్తిగా తొలగలేదు. ధనుష్ రాయన్, శర్వానంద్ మనమేలు ఒకరోజు ఆటో ఇటో ఆ వారమే వచ్చేలా ఉన్నాయి. 80 దశకం కుప్పం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హరోంహరకు జ్ఞాన సాగర్ దర్శకుడు. చూడాలి ఈసారి సుధీర్ లక్కు ఎలా ఉందో.