పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్ ట్యాగ్ ని మళ్ళీ తెచ్చుకునే దిశగా 2022లో భారీ డిజాస్టర్లు మూటగట్టుకుంటుంది. ఏదో అదృష్టం కొద్దీ గుంటూరు కారం ఛాన్స్ వచ్చిందనుకుంటే ఏదేదో జరిగి ఆ ఆఫర్ శ్రీలీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వలేకపోయింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఒక లైలా కోసం చేసిన నాగ చైతన్యతో మళ్ళీ నటించే అవకాశం దక్కినట్టుగా టాక్ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించే దాకా ఆగాలి. అసలు మ్యాటర్ వేరే ఉంది.

సూర్య నటించబోయే 44వ సినిమాలో పూజానే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జూన్ 2 ప్రారంభం కాబోతోందని చెన్నై టాక్. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మిగిలిన భాషల్లో ఆడలేదు. అయినా సరే తన టేకింగ్ మీద స్టార్ హీరోలకు బోలెడు గురి. ఈ సినిమా వల్లే లారెన్స్ చాలా బిజీ అయ్యాడు. ఇప్పుడు సూర్యతో కార్తీక్ చేయబోయే మూవీ భారీ బడ్జెట్ తోనే ఉంటుందట. పర్యావరణానికి సంబంధించిన ఒక సోషల్ మెసేజ్ చుట్టూ మంచి కమర్షియల్ డ్రామా అల్లుకున్నట్టు యూనిట్ లీక్. మాస్ టచ్ తోనే ఉంటుందట.

సో ఏడాది నిరీక్షణకు బ్రేక్ పడేలా పూజా హెగ్డేకి సరైన బ్రేక్ దొరికింది. చైతుది కూడా కన్ఫర్మ్ అయితే హైదరాబాద్ లోనే తిరిగి పాగా వేయొచ్చు. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తోంది కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న, శ్రీలీల పోటీ వల్ల రేసులో వెనుకబడిన పూజా హెగ్డే పెద్ద మలుపు కోసం ఎదురు చూస్తోంది. రవితేజ సరసన ఒక ఛాన్స్ వచ్చిందనే వార్త తిరుగుతోంది కానీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాకే స్పష్టత వస్తుంది. బుట్టబొమ్మగా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ దక్కిన తర్వాత ఈ పరిస్థితి విచిత్రమే.