టాలెంట్ కి ఎలాంటి లోటు లేకపోయినా కష్టపడే తత్వంలో తన రేంజ్ హీరోల కంటే కొన్ని అడుగులు ముందున్న సుధీర్ బాబుకి సక్సెస్ విషయంలో అదృష్టం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక మార్కెట్ బాగా డీలా పడింది. అందుకే ఆశలన్నీ హరోం హర మీదే పెట్టుకున్నాడు. మే 31 విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తీవ్రమైన పోటీ అతనికి పెద్ద సవాల్ గా మారే సూచనలు స్పష్టం. గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనూహ్యంగా మే 17 నుంచి వాయిదా పడి హరోం హర వచ్చే రోజునే ఎంచుకోవడంతో ఓపెనింగ్స్ పరంగా విశ్వక్ సేన్ కంటే సుధీర్ బాబుకే ఎక్కువ రిస్క్ కనిపిస్తున్న మాట వాస్తవం.
దీన్ని కాచుకోవడం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే గ్యాంగ్స్ అఫ్ గోదావరి తెస్తున్నది సితార సంస్థ. దానికున్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి. హరోం హరకు బయ్యర్లు ఉన్నప్పటికీ పోలిక పరంగా చూసుకుంటే ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ విశ్వక్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంది. ఇది కాకుండా మ్యూజిక్ షాప్ మూర్తి, గంగం గణేశా, సత్యభామ, భజే వాయు వేగం కూడా అదే డేట్ మీద కన్నేశాయి. ఇదంతా ఒక ఎత్తయితే సరిగ్గా ఈ సినిమాలన్నీ రిలీజైన అయిదో రోజే జూన్ 4న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి.
ఈసారి రాజకీయం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో గెలిచే పార్టీ ఏదైనా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. సంబరాలతో పాటు గొడవలు జరిగే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇలాంటి వాతావరణంలో జనాలు అదే పనిగా థియేటర్లకు రావడం అనుమానమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పెద్దగా ఇబ్బందేం ఉండకపోవచ్చేమో కానీ యావరేజ్ అనిపించుకుంటే మాత్రం వసూళ్లకు కష్టపడాల్సి ఉంటుంది. సుధీర్ బాబు మాత్రం హరోంహర విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, హరోంహర రెండిట్లోనూ హీరోకి రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఉండటం కాకతాళీయమే అయినా గమనించాల్సిన విషయం.