ఆరంభం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన చిత్రం ఆరంభం. పేరున్న నటీనటులు లేకపోయినా ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించారన్న అభిప్రాయం జనంలో కలిగించగలిగారు. కృష్ణమ్మ, ప్రతినిధి 2 పోటీ మధ్య దిగిన ఆరంభం నిన్న రిలీజయ్యింది.

కంటెంట్ బాగుంటే క్యాస్టింగ్ ఎవరని పట్టించుకోకుండా హిట్ చేసే తెలుగు ఆడియన్స్ ని నమ్ముకుని థియేటర్లకు తీసుకొచ్చారు. మోహన్ భగత్ హీరోగా నటించిన ఈ టైం థ్రిల్లర్ కు అజయ్ వీటి దర్శకత్వం వహించగా సింజిత్ సంగీతం సమకూర్చారు. ఇంతకీ బొమ్మెలా ఉందో చూద్దాం.

మిగిల్ (మోహన్ భగత్) ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఇంకొద్ది గంటల్లో శిక్ష అమలు పరచాల్సి ఉండగా కాలఘటి జైలు నుంచి అంతుచిక్కని రీతిలో తప్పించుకుంటాడు. నిజం వెలికితీయడానికి ఒక డిటెక్టివ్ (రవీంద్ర విజయ్) వస్తాడు. అప్పుడే తోటి ఖైదీ(లక్ష్మణ్) ఇచ్చిన డైరీ ద్వారా గతం తెలుస్తుంది. ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే సైంటిస్ట్ రావు (భూషణ్ కళ్యాణ్) టైం ట్రావెల్ మీద ప్రయోగాలు చేస్తుంటాడు. మిగిల్ మీద ఈ ఎక్స్ పరిమెంట్ పని చేస్తుంది. దీని ద్వారా తల్లి (సురభి ప్రభావతి) ని సంతోషపెట్టే పనులు చేస్తాడు. ఆ తర్వాత జరిగే ఊహించని సంఘటనలు కథను మలుపు తిప్పుతాయి.

శర్వానంద్ ఒకే ఒక జీవితంకు దగ్గరగా అనిపించే లైన్ తీసుకున్న అజయ్ వీటి అంత ఎంగేజింగ్ గా ఆరంభంని తీర్చిదిద్దలేదు. టెక్నికల్ పనితనం చాలా బాగున్నా విపరీతమైన నెమ్మదితనంతో సాగే స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ దాకా సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

సెకండాఫ్ లో కొంత స్పీడ్ పెరిగినా అసంతృప్తిని పూర్తిగా తగ్గించలేకపోయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఇచ్చే ట్విస్టులు బాగున్నాయి. చాలా బడ్జెట్ పరిమితుల మధ్య కష్టపడిన వైనం కనిపిస్తుంది.

అధ్యాయాల రూపంలో చెప్పే ప్రయత్నం కొంత కన్ఫ్యూజన్ కు దారి తీసింది. ఆర్టిస్టులు పర్వాలేదు. బోలెడు ఓపికని డిమాండ్ చేసే ఆరంభం ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రం కాదు.