ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణాల్లో ఎన్నికలు మొదటిది కాగా ఐపీఎల్ రెండోది. వీటిలో ఎలక్షన్ల సందడి సోమవారంతో ముగుస్తుంది. రాజకీయ పార్టీల ప్రచారం, ఓట్ల చర్చలు, స్వంత ఊళ్లకు ప్రయాణాలు ఈ హడావిడికి ఇంకో మూడు రోజుల్లో శుభం కార్డు పడుతుంది. సినీ పరిశ్రమ ఎదురు చూస్తోంది దీని కోసమే. థియేటర్లకు జనాలు రాక అల్లాడుతున్న టైంలో వచ్చే ఫ్రైడే నుంచి టికెట్ కౌంటర్ల దగ్గర జనం కళకళలాడాలని ఎదురు చూస్తున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం.
పోలింగ్ అయ్యాక వచ్చే మొదటి శుక్రవారం మే 17. ముందు ప్రకటించిన ప్రకారమైతే గ్యాంగ్స్ అఫ్ గోదావరి రావాలి. కానీ అనూహ్యంగా అది వాయిదా పడి నెలాఖరుకు వెళ్లిపోవడంతో బరిలో రాజు యాదవ్ ఒక్కటే నిలిచింది. కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. చిన్న సినిమా కదాని ఆషామాషీ టీమ్ పని చేయలేదు. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలు సమకూర్చగా సురేష్ బొబ్బిలి బీజీఎమ్ అందించారు. ఇరవై దాకా నటీనటులతో క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ప్రమోషన్లు గట్రా గట్టిగానే చేస్తున్నారు. పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు.
అలా అని దీనికి ఆడియన్స్ ఎగబడతారని కాదు కానీ నెలన్నర నుంచి నెలకొన్న బాక్సాఫీస్ గ్యాప్ ని ముఖ్యంగా బిసి సెంటర్లలో రాజు యాదవ్ వాడుకునే ఛాన్స్ లేకపోలేదు. ఆ మధ్య సుడిగాలి సుధీర్ గాలోడు మీద ఎంత నెగటివిటీ వచ్చినా నిర్మాతకు లాభాలే ఇచ్చింది. బడ్జెట్ పరంగా రిస్క్ లేకపోవడం ఇలాంటి సినిమాలకు కలిసి వస్తోంది. హిందీ, ఇంగ్లీష్ లోనూ చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరి సోలోగా దక్కిన ఈ అవకాశాన్ని రాజు యాదవ్ ఎలా వాడుకుంటాడో చూడాలి. మే 31 ఇంతకు ముందే లాక్ చేసుకున్న అయిదు సినిమాల్లో ఏదో ఒకటి ముందుకు జరగొచ్చు కానీ ఆ సూచనలు కనిపించడం లేదు.