స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసి స్ఫూర్తి చెంది ఎన్నో బ్లాక్ బస్టర్లిచ్చిన వాళ్ళ లిస్టు రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. అంతకు ముందు దాసరి గారి స్కూల్ నుంచి కోడి రామకృష్ణ లాంటి లెజెండరీలు వచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటి జనరేషన్ లో సుకుమార్ పరిచయం చేస్తున్న టాలెంట్స్ టాలీవుడ్ లో బలమైన ముద్ర వేస్తున్నాయి. నిన్న విడుదలైన ప్రసన్నవదనం దర్శకుడు అర్జున్ పనితనం మీద ప్రశంసలు వస్తన్నాయి. కథలో చూపించిన ట్విస్టుల గురించి బాగా మాట్లాడుకుంటున్నారు.
ఇతనికన్నా ముందు కుమారి 21 ఎఫ్ తో పరిచయమిన సూర్యప్రతాప్ పల్నాటి డెబ్యూతోనే హిట్టు కొట్టి ఋజువు చేసుకున్నాడు. ఆ తర్వాత అంచనాలకు తగ్గట్టు రాణించలేక వెనుకబడటం వేరే విషయం. విరూపాక్షతో లాంచ్ అయిన కార్తీక్ దండు ఇప్పుడు ఏకంగా నాగ చైతన్యతో ప్రాజెక్టు లాక్ చేసుకుంటున్నాడు. ఉప్పెన వెనుక ఉండి నడిపించినందుకు సుక్కుని గురువు కంటే ఎక్కువగా భావించే బుచ్చిబాబు సనా ఏకంగా రామ్ చరణ్ తో ప్యాన్ ఇండియా మూవీకి స్క్రిప్ట్ రెడీ చేసుకుని షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సైతం సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు.
ఇవి సక్సెస్ అయిన లిస్టు మాత్రమే. హంగామాకు ఆడంబరానికి దూరంగా ఉండే సుకుమార్ కి ఇందరు సెటిలవ్వడం కన్నా ఆనందం ఏముంటుంది. మరికొందరు ట్రయిల్స్ లో ఉన్నారు. పుష్పతో జాతీయ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సుకుమార్ కు తగ్గట్టే ఆయన స్టూడెంట్స్ కూడా వెరైటీ కాన్సెప్ట్స్ తో ముందుకొస్తున్నారు. వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సైతం హాజరవుతున్న ఈ విలక్షణ దర్శకుడు నమ్మితే చాలు వాళ్ళ కెరీర్ సెట్ అయ్యేదాకా ఫాలో అప్ చేస్తారని ఫ్రెండ్స్ మాట. సరైన ప్రతిభ ఉందని గుర్తిస్తే చాలు దగ్గరికి తీసుకుని వాళ్ళను పదును పెట్టడంలో సుకుమార్ తర్వాతే ఎవరైనా.