చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని, సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టం వచ్చినట్టు మార్చేసి ఆడియన్స్ ని నిరాశ పరుస్తారు. 2019లో పాకిస్థాన్ చేసిన పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారతదేశం చేసిన ప్రతిదాడుల ఆధారంగా ఈ ఏడాది రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చాయి. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదటగా చెప్పుకోవాలి. హడావుడి తప్ప విషయం తక్కువైన ఈ ఎయిర్ థ్రిల్లర్ ని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు.
దీనికన్నా ముందు జనవరిలో ‘ఫైటర్’ వచ్చింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా హృతిక్ రోషన్ ఇమేజ్, దీపికా పదుకునే లాంటి స్టార్ క్యాస్టింగ్ మరీ డ్యామేజ్ జరగకుండా మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. కానీ బెస్ట్ మూవీ కాలేకపోయింది. ఇదే బ్యాక్ డ్రాప్ ని తీసుకుని ఇటీవలే ‘రణ్ నీతి బాలాకోట్ అండ్ బియాండ్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. చాలా డీటెయిల్డ్ గా ఆసక్తి కలిగించేలా దర్శకుడు సంతోష్ సింగ్ తీసిన విధానం మెప్పించేలా ఉంది. సిరీస్ కావడంతో సహజంగానే కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ పద్దతిగా ఉన్న పరిశోధన కనిపిస్తుంది.
అసలు ఈ అటాక్ కు ముందు శత్రుదేశంలో ఏం జరిగింది, మన అధికారులు రాజకీయ నాయకుల ఆలోచనా ధోరణి ఎలా ఉండింది అనే విషయాలతో పాటు బాలాకోట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది టచ్ చేశారు. జిమ్మీ షెర్గిల్ ప్రధాన పాత్ర పోషించగా మన తెలుగు సినిమాల్లో విలన్లుగా కనిపించే అశుతోష్ రానా, ఆశిష్ విద్యార్థి ముఖ్యమైన క్యారెక్టర్లు దక్కించుకున్నారు. లారా దత్తా, ఆకాంక్ష సింగ్ రూపంలో గ్లామర్ జోడించారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో లెన్త్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తం చూశాక ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ కన్నా ఇది ఎన్నోరెట్లు బెటరనిపించడం ఖాయం.