అతిలోకసుందరి స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఏడు సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏదో డబుల్ జాక్ పాట్ తరహాలో ఆర్ఆర్ఆర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఒకేసారి రెండు ఆఫర్లు పట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవర షూటింగ్ కొలిక్కి వస్తుండగా ఆర్సి 16 వేసవి పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంత క్రేజీ అవకాశాలున్నా బాలీవుడ్ జాన్వీ ఎక్కువ ఫిమేల్ ఓరియెంటెడ్ కథలే ఎంచుకుంటోంది. స్టార్ హీరోల సరసన జోడిగా కన్నా సోలోగా కనిపించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.
తాజాగా ఉలజ్ అనే సినిమా చేసింది జాన్వీ, జూలైలో విడుదల కానుంది. టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో ఐడియా ఇచ్చారు. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. అయితే రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కదు. బయటకు రాలేని ఆ విష వలయం నుంచి ఎలా బయట పడిందనేది స్టోరీ పాయింట్ గా కనిపిస్తోంది. అసలు కంటెంట్ లో కథ కొంచెం వేరుగా ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రం స్పష్టంగా ఉంది. శుభాన్షు సరియా దర్శకత్వం వహించిన ఉలజ్ లో ప్రత్యేకంగా హీరో అంటూ లేడు.
ఇక అలియా భట్ కు ఈ సినిమాకు లింక్ ఏంటో చూద్దాం. ఉలజ్ ని పోలిన పాత్రలో ఇంతకు ముందు తను రాజీ చేసింది. పాకిస్థాన్ అధికారి ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడి రహస్యాలను మనకు చేరవేసే సీక్రెట్ ఏజెంట్ గా అలియా చూపించిన పెర్ఫార్మన్స్ కమర్షియల్ సక్సెస్ తో పాటు బోలెడు అవార్డులు తెచ్చింది. చూస్తుంటే ఉలజ్ కూడా అదే తరహాలో కనిపిస్తోంది. గ్లామర్ డోస్ చూపించడం కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న జాన్వీ కపూర్ ఇంట గెలిచి రచ్చ గెలిచే ఛాన్స్ ఈ 2024 సంవత్సరం ఇచ్చేలా ఉంది. చూడాలి మరి ఎలా వాడుకోబోతోందో.