డైరెక్టర్లు హీరోలు కావడం కొత్తేమి కాదు కానీ క్రియేటివిటీతో న్యూ ట్రెండ్ ని తీసుకొచ్చే వాళ్ళు నటన వైపు టర్నింగ్ తీసుకోవడం కొన్ని మంచి చిత్రాలు రాకుండా చేస్తుంది. తరుణ్ భాస్కర్ వరస చూస్తుంటే అదే అనిపిస్తోంది. గత ఏడాది కీడా కోలాతో అమోఘమైన విజయం అందుకోకపోయినా ఉన్నంతలో డీసెంట్ సక్సెస్ దక్కించుకున్న ఈ న్యూ ఏజ్ టాలెంట్ ఇప్పటిదాకా తీసింది మూడు సినిమాలే. మొదటిది పెళ్లి చూపులు తనకే కాదు విజయ్ దేవరకొండకూ చక్కని లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడింది. తక్కువ బడ్జెట్ లో ఇచ్చిన కూల్ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది.
రెండోది ఈ నగరానికి ఏమైంది. రిలీజైన టైంలో అద్భుతాలు చేయలేదు కానీ క్రమంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ మధ్య మళ్ళీ విడుదల చేస్తే యూత్ ఎగబడి థియేటర్లకు పోటెత్తారు. ఇది చూసి నిర్మాత సురేష్ బాబుతో పాటు తరుణ్ భాస్కర్ కూడా షాక్ అయ్యాడు. కట్ చేస్తే తరుణ్ భాస్కర్ ఎక్కువ యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తను 2022లో వచ్చిన మలయాళం హిట్ మూవీ జయ జయ జయహే రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. దీని షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది. తెలుగు డబ్బింగ్ తో సహా ఓటిటిలో అందుబాటులో ఉన్న మూవీని మళ్ళీ తీయడమంటే కంటెంట్ మీద నమ్మకమే.
తరుణ్ భాస్కర్ మేకప్ వేసుకోవడం కొత్తేమి కాదు. మంగళవారం స్పెషల్ సాంగ్ లో ఏకంగా డాన్సు చేశాడు. అంతకు ముందు మీకు మాత్రమే చెప్తాలో కథానాయకుడిగా నటించాడు. సీతారామం లాంటి వాటిలో సపోర్టింగ్ రోల్స్ వేశాడు. యాంకర్ గానూ ట్రై చేశాడు. ఇదేమి తప్పు కాదు కానీ కమర్షియల్ ఫార్ములాకు కట్టుబడకుండా సృజనాత్మకతో ఆలోచించే దర్శకులు టాలీవుడ్ లో తగ్గిపోతున్న టైంలో ఇలా తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు సేఫ్ గేమ్ కోసం నటులుగా మారిపోతే ఎలా అనేది మూవీ లవర్స్ ప్రశ్న. అలా అని డైరెక్షన్ మానేయలేదు కానీ వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాలని కోరుకుంటున్నారు.