ఇరకాటంలో పడ్డ కల్కి వ్యవహారం

కల్కి 2898 ఏడి విడుదల గురించి అంతులేని ఊహాగానాలు రేగుతూనే ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సెంటిమెంట్ తమకు అచ్చి వచ్చింది కాబట్టి మే 9 కన్నా బెస్ట్ ఆప్షన్ మరొకటి ఉండదని నిర్మాత అశ్వినీదత్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో పాటు ఏపీలో ఎన్నికల వాతావరణం వేడిగా ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు. మే 30 లేదా జూన్ 20 ఈ రెండు ఆప్షన్ల మీద టీమ్ తర్జన భర్జనలు పడిందట. జూలైకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పరిగణనలో ఉంది. ఇంతకీ ఇరకాటం మ్యాటర్ ఏంటో చూద్దాం.

కల్కి ఒకవేళ జూన్ లో రావాలనుకున్నా కష్టమే. ఎందుకంటే భారతీయుడు 2ని జూన్ 13 లాక్ చేశారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే బాకీ. కూతురి పెళ్లిలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ రాగానే మాట్లాడి కన్ఫర్మ్ చేస్తారు. కల్కిలో కూడా కమల్ హాసన్ ఉన్నారు కాబట్టి దాంతో క్లాష్ అయ్యేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు. పైగా ముందు బ్లాక్ చేసుకుంది ఇండియన్ 2 కనక దీనికి వదిలేయడం తప్ప వేరే మార్గం ఉండదు. జూలై అయితే మరీ లేట్ అయిపోతుందని, పిల్లల సెలవులు పూర్తిగా అయిపోయి స్కూళ్ళు, కాలేజీలలో బిజీ అయిపోతారని మరో అనాలిసిస్ చెబుతున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కల్కికి టికెట్ రేట్ల పెంపు ఎంతో అవసరం. ఒకవేళ టిడిపి జనసేన పొత్తు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదు. లేదూ జగన్ రెండోసారి గెలిస్తే కొత్త ఇరకాటం వస్తుంది. ప్రభాస్ కోసమే సలార్ కు అతికష్టం మీద 50 రూపాయల హైక్ ఇచ్చారు. అంతకన్నా ఎక్కువ ఏపీలో కల్కికి ఇవ్వడం డౌటే. అశ్వినిదత్ టిడిపి మద్దతుదారుడనే సంగతి మర్చిపోకూడదు. ఆగస్ట్ నుంచి నెలకో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఉంది కనక కల్కి ఖచ్చితంగా జూలైలోపే రావాలి. డేట్ ని నిర్ణయించడమే పెద్ద సవాల్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో లెట్ సీ.