క‌ల‌ర్ ఫొటో రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ఈ మ‌ధ్య తెలుగులో చ‌క్క‌టి ప్రోమోల‌తో ఆక‌ట్టుకున్న చిన్న సినిమా.. క‌ల‌ర్ ఫోటో. కమెడియన్‌గా సత్తా చాటిన సుహాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి కథానాయికగా.. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రమిది. ‘హృదయకాలేయం’ దర్శక నిర్మాత సాయిరాజేష్ నీలం ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. దీని టీజ‌ర్, పాట‌.. మంచి ఫీల్‌తో ఉండి జ‌నాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఈ చిత్రం అల్లు వారి ఓటీటీ ఆహాలో రిలీజ్ కాబోతోంద‌ని వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళికి రిలీజ్ అన్నారు. కానీ అంత‌కంటే ముందే సినిమా స్ట్రీమ్ కాబోతోంది.

వచ్చే నెల‌లో ద‌స‌రా కానుక‌గా క‌ల‌ర్ ఫోటోను ఆహాలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ద‌స‌రా అక్టోబ‌రు 25న కాగా.. అంత‌కు రెండు రోజుల ముందు, అక్టోబ‌రు 23న క‌ల‌ర్ ఫోటో విడుద‌ల కానుంది. కొత్త కంటెంట్ లేద‌ని ఆహా మీద విమ‌ర్శ‌లు వ‌స్తున్న త‌రుణంలో ఆ సంస్థ కొంచెం దూకుడు పెంచింది. అక్టోబ‌రు 2న ఆహాలోనే రాజ్ త‌రుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా విడుద‌ల కానున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే క‌ల‌ర్ ఫోటో గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఈ నెల 18న అందులోనే అమ‌రం అఖిలం ప్రేమ అనే మ‌రో చిన్న సినిమా వ‌స్తోంది. అన్నింట్లోకి ప్రేక్ష‌కుల దృష్టిని ఎక్కువ ఆక‌ర్షిస్తున్న‌ది మాత్రం క‌ల‌ర్ ఫోటోనే. ఆహా ప‌ట్ల ఆక‌ర్ష‌ణ పెంచే సినిమా అవుతుంద‌ని దీనిపై అంచ‌నాలు పెట్టుకున్నారు.