తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ హీరో సిద్దార్థ్.. కొంచెం ఔట్ స్పోకెన్ అన్న సంగతి తెలిసిందే. స్టేజ్‌ల మీద, ఇంటర్వ్యూల్లో మాట్లాడేటపుడు కొంచెం ఓపెన్‌గా ఉంటాడు. ఎవరి మీదైనా కౌంటర్లు వేయడానికి వెనుకాడడు. ఏదైనా విషయంలో బాధ పడ్డా ఆ బాధను దాచుకోడు.
తన చివరి సినిమా చిత్తా తెలుగు వెర్షన్ చిన్నాను తెలుగులో రిలీజ్ చేద్దామంటే థియేటర్లు దొరకలేదంటూ స్టేజ్ మీద ఆవేదన స్వరంతో మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. కానీ మంచి సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే ఆ సినిమాను అందరూ చూసి తట్టుకోలేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై ఒక అవార్డుల కార్యక్రమంలో సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చిత్తా సినిమాను చూడడం కష్టమని ఒక్క మహిళ కూడా తనతో కానీ.. దర్శకుడు అరుణ్‌తో కానీ చెప్పలేదని.. కానీ మగాళ్లు మాత్రం చాలామంది ఈ సినిమా చూసి తట్టుకోవడం కష్టమని కామెంట్లు చేశారని సిద్దార్థ్ అన్నాడు. తమ సినిమా విషయంలో ఇలా మాట్లాడిన వాళ్లే మృగం అనే సినిమాను మాత్రం చూస్తారని.. కానీ వాళ్లకు చిత్తా సినిమా మాత్రం డిస్టర్బింగ్‌గా అనిపిస్తుందని సెటైరిగ్గా మాట్లాడాడు సిద్దార్థ్. చిత్తా లాంటి సినిమాను చూసి డిస్టర్బింగ్‌గా ఉందని అనడం సిగ్గు చేటని… త్వరలోనే ప్రేక్షకులు మారుతారని ఆశిస్తున్నానని సిద్దార్థ్ వ్యాఖ్యానించాడు.
మృగం అంటూ తమిళంలో చెప్పాడు కానీ.. నిజానికి అతను కౌంటర్ వేసింది యానిమల్ మూవీ గురించే. ఈ సినిమాను వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పలు రకాలుగా విమర్శించారు. ఇప్పుడు ఈ జాబితాలో సిద్దార్థ్ కూడా చేరాడు. అతడి వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.