ఇటీవలే విడుదలైన గీతాంజలి మళ్ళీ వచ్చింది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందన తెచ్చుకోలేదన్న విషయం వసూళ్లలోనే తేటతెల్లమవుతోంది. నిర్మాత కం రచయిత కోన వెంకట్ మాత్రం ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని చెబుతున్నారు. మొన్న ఏకంగా యాభై కోట్ల గ్రాస్ రావాలని కోరుకోవడం వైరల్ టాపిక్ గా మారింది. ఎంత హీరోయిన్ అంజలికి ల్యాండ్ మార్క్ మూవీ అయినా మరీ ఇంత పెద్ద నెంబర్ ఏమిటని నెటిజెన్లు కామెంట్ చేశారు. కామెడీ మీద రివ్యూలలో వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి వెంకట్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
నిన్న ట్విట్టర్ వేదికగా రెండు నిమిషాల సత్య నటించిన వీడియో క్లిప్ ని కోన వెంకట్ షేర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే థియేటర్ లో సినిమా రన్నింగ్ లో ఉండగా తక్కువ నిడివి అయినా సరే సెల్ ఫోన్ తో షూట్ చేయడం చట్టరిత్యా నేరం. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అంతే సమానంగా పరిగణించే తప్పు. ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి అబ్జెక్షన్ ఏంటని కొందరికి అనిపించవచ్చు. కానీ ఒక్కసారి మూవీని అమ్మేశాక అది డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్ల ఉమ్మడి ఆస్తిగా మారిపోతుంది. థియేటర్ రన్ అయ్యాక తిరిగి నిర్మాత సొత్తే. అలాంటప్పుడు ఇలా పెట్టడం సరికాదు.
పెద్దగా పోటీ లేని అవకాశాన్ని గీతాంజలి మళ్ళీ వచ్చింది వాడుకోలేకపోయింది. మొదటి భాగంలో ఉన్న ఫ్రెష్ నెస్, కామెడీ ఇందులో కొరవడటంతో పబ్లిక్ టాక్ సైతం ఆశాజనకంగా లేదు. కమెడియన్లు సత్య, సునీల్ కు కొంత మేర నవ్వించినప్పటికీ పూర్తి స్థాయిలో బాగుందని చెప్పేందుకు అది ఎంత మాత్రం సరిపోలేదు. హారర్, కామెడీ రెండింటినీ బాలన్స్ చేసే తీరులో దర్శకుడు శివ తుర్లపాటి తడబడటం అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపించింది. బిసి సెంటర్స్ కలెక్షన్ల మీద ఆధారపడే పరిస్థితి నెలకొంది. యాభై కొట్టడం తరువాత వీకెండ్ లో పది కోట్ల గ్రాస్ దాటితే గొప్పే అనుకోవచ్చు.