ఒక బ్లాక్ బస్టర్ సాధించాక దాని తర్వాత చేయబోయే సినిమా మీద కొందరు దర్శకులు విపరీతమైన ఒత్తిడి తెచ్చుకుని చేదు ఫలితాలు అందుకోవడం అవకాశాలను ప్రభావితం చేస్తోంది. 2018 గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ అయిదేళ్ళు ఖర్చు పెడితే మహేష్ బాబు సర్కారు వారి పాట ఛాన్స్ దొరికింది. దీనికన్నా ముందు నాగ చైతన్యతో ఒక ప్రాజెక్టుని దాదాపు ఓకే చేసుకునే స్టేజిలో వదులుకోవడం బయటికి కనిపించని కోల్డ్ వార్ కు దారి తీసిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు సర్కారు వారి పాటకు వసూళ్లు వచ్చాయి కానీ కంటెంట్ పరంగా పరశురామ్ బెస్ట్ అనిపించుకోలేదు.
ఇక ది ఫ్యామిలీ స్టార్ సంగతి సరేసరి. మాములు ఫ్లాప్ అయితే ఎదో అనుకోవచ్చు. డిజాస్టర్ దిశగా అడుగులు అడుగులు పడుతున్న వైనం కలెక్షన్లలో కనిపిస్తోంది. హాలిడేస్ కూడా ఉపయోగపడటం లేదు. విజయ్ దేవరకొండకు మరో నిరాశ కలిగించే ఫలితమే దక్కింది. కట్ చేస్తే ఇప్పుడు పరశురామ్ కు ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే కథల కూర్పులో, మేకింగ్ లో తన బలహీనతలు రెండుసార్లు దెబ్బ కొట్టాయి. స్క్రిప్ట్ విషయంలో ఎవరి మాటా వినడనే కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లోనే ఉంది. ఇలాంటి టాక్ ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు పట్టడం సులభం కాదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దిల్ రాజునే మరో సినిమా ఇస్తానని హామీ ఇచ్చారట. గతంలో వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ తదితరులను తన బ్యానర్లోనే ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో ఇంకో అవకాశం ఇచ్చి కెరీర్ కుదురుకునేలా చేశారు. పరశురామ్ కు అలాంటి ఆఫరే ఇవ్వొచ్చని తెలిసింది. అయితే హీరోని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు కాస్త పెద్ద లెవెల్ స్టార్ దొరికితే సరైన కథతో హిట్టు కొట్టొచ్చు. కాకపోతే ఎవరు ఎస్ అంటారనేది అంత సులభంగా తేలని భేతాళ ప్రశ్న.